కామారెడ్డి టౌన్, డిసెంబర్ 13 : ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సహకార అధికారులు, ట్రాన్స్పోర్టర్లతో ధాన్యం కొనుగోలుపై సోమవారం సమీక్ష నిర్వహించారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతుల వివరాలు ట్యాబ్‌లో వెంటనే నమోదు చేయాలని సూచించారు. రైతులకు డబ్బులు సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణాకు సరిపడే వాహనాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా జనరల్ మేనేజర్ జితేంద్రప్రసాద్, ఇన్చార్జి డీఎస్వో రాజశేఖర్, జిల్లా సహకార అధికారిణి వసంత, సీఈవోలు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.
వంద శాతం ‘ఈ శ్రమ్’ పూర్తి చేయాలి
కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సోమవారం పర్యటించారు. ఉపాధి హామీలో పని చేస్తున్న కూలీలు అందరూ వివరాలను ‘ఈ శ్రమ్’లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ఉపాధి హామీ పనుల్లో భాగంగా చేపడుతున్న ఫాంపాండ్లను పరిశీలించారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఫాంపాండ్లు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. నర్సరీలో మొక్కల పెంపకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రభుత్వ స్థలంలో పండ్ల మొక్కలు నాటి కంచెలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలోని నర్సరీకి 10 వేల మొక్కల లక్ష్యం ఉందని, బ్యాగ్ ఫిల్లింగ్ సకాలంలో పూర్తి చేసి మొక్కలు నాటేందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించాలని అధికారులకు సూచించారు. కొలతల ప్రకారం కూలీలకు డబ్బులు చెల్లించాలన్నారు. రైతులకు పందిరి సాగు పద్ధతిపై అవగాహన కల్పించారు. ఆయనతోపాటు ఎంపీడీవో నాగేశ్వర్, సర్పంచ్ హన్మాండ్లు, పంచాయతీ కార్యదర్శి నవనీత తదితరులు పాల్గొన్నారు.