
పాడిరైతుల కోసం పథకాల వెల్లువ..
ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఆర్థిక వృద్ధి
మెదక్ జిల్లాలో 2,490 మంది రైతులు
జిల్లాలో ఏడు పాల శీతలీకరణ కేంద్రాలు
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 13 :తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విజయ డెయిరీ పాల ఉత్పత్తి, స్వచ్ఛమైన పాలు, పాల పదార్థాలు వినియోగదారులకు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామాల్లో పాడి రైతులను ప్రోత్సహించడంతో పాటు పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకం అందజేస్తున్నది. పాడి రైతుల కోసం కొత్తగా సంక్షేమ పథకాలను పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య తీసుకొచ్చింది. విజయ డెయిరీ ద్వారా ఈ-ల్యాబ్‌లో పేరు నమోదు చేసుకున్న వారికి అనేక సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నది.
గ్రామాల్లో పాడి రైతులను ప్రోత్సహించడంతోపాటు పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకం అందజేస్తుండగా, పాడి రైతుల కోసం కొత్తగా సంక్షేమ పథకాలను తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య తీసుకొచ్చింది. విజయ డెయిరీ ద్వారా ఈ-ల్యాబ్‌లో పేరు నమోదు చేసుకున్న వారికి అనేక సంక్షేమ పథకాలు వర్తిస్తుండగా, జిల్లాలోని వేల మంది పాడి రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. రోజురోజుకూ ప్రైవేట్ డెయిరీల నుంచి పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు ‘విజయ’ కొన్నేండ్లుగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నది. గతంలో కంటే ప్రస్తుతం అదనంగా మరిన్ని రాయితీలు, ప్రో త్సాహకాలను ఇస్తున్నట్లు డెయిరీ నిర్వాహకులు చెబుతున్నారు.
జిల్లాలో ప్రతిరోజు 5,500 లీటర్ల పాల సేకరణ
విజయ డెయిరీకి మెదక్ జిల్లాలో 7 పాల శీతలీకరణ కేం ద్రాలు ఉన్నాయి. ఇందులో మెదక్ పాల శీతలీకరణ కేంద్రంతో పాటు రామాయంపేట, కౌడిపల్లి, పాపన్నపేట, పెద్దశంకరంపేట, రేగోడ్, యావపూర్‌లో మినీ పాలశీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. 158 పాల సేకరణ కేంద్రాల ద్వారా 2,490 మంది పాడి రైతుల నుంచి ప్రతిరోజూ 5,500 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. ప్రతిరోజూ 5 రూట్లలో ఆటోల ద్వారా పాలను తరలిస్తున్నారు.
విజయ విద్యాకానుక పథకం..
పాడి రైతు కుటుంబంలో విద్యార్థి పదో తరగతిలో 9 జీపీఏ సాధిస్తే రూ.వెయ్యి, ఎంసెట్‌లో 10 వేలలోపు ర్యాంకు వస్తే రూ. 2 వేలు, ఐఐటీ, జేఈఈలో సీటు వస్తే రూ.2 వేలు, అఖిల భారత సర్వీసులో ఉద్యోగం సాధించిన వారికి రూ.10వేల నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రశంసా పత్రం అందిస్తారు.
స్వచ్ఛమైన పాలు అందిస్తున్న ‘సిద్దిపేట విజయ డెయిరీ’
స్వచ్ఛమైన.. నాణ్యమైన అమృతంలాంటి పాలు, పాల పదార్థాలు అందిస్తూ జిల్లా కేంద్రం సిద్దిపేటలోని విజయ డెయిరీ జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నది. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో సిద్దిపేట విజయ పాల డెయిరీ నెలకు మూడున్నర కోట్ల చెల్లింపులతో లక్ష్యం దిశగా అభివృద్ధి చెందుతున్నది. సిద్దిపేట – కరీంనగర్ జిల్లాలోని వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ పాడిరైతులకు అండగా నిలుస్తున్నది. తెలంగాణ ప్రభు త్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న విజయపాల డెయిరీని అభివృద్ధి చేసేందుకు మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించడంతో డెయిరీ దినదినాభివృద్ధి సాధిస్తున్నది. పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ద్వారా సిద్దిపేట విజయడెయిరీ ఆధ్వర్యంలో వినియోగదారులకు నాణ్యమైన, స్వచ్ఛమైన పాలు, పాల పదార్థాలు అందించేందుకు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే మంత్రి ప్రత్యేక చొరవతో రూ.94 లక్షల నిధులతో డెయిరీలో అత్యంత ఆధునిక మెషిన్లు ఏర్పాటు చేశారు. 1985లో సిద్దిపేటలో విజయడెయిరీని నెలకొల్పగా, ప్రస్తుతం 520 గ్రామాల్లోని కేంద్రాల ద్వారా పాడి రైతుల నుంచి రోజుకు 35 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. డెయిరీలో 4000 లీటర్లకు పైగా పాల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు. 12000 వేల మంది పాడి రైతులు విజయ డెయిరీకి పాలు పోస్తున్నారు. ఎక్కడాలేని విధంగా లీటరు పాలకు రూ.4ప్రోత్సాహకం ప్రభు త్వం అందిస్తున్నది. సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లోని వివిధ ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ సంస్థలకు పాల ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
పాడి రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన జిల్లాలోని వేల మందికి ప్రయోజనం జరుగుతుంది. వారితో పాటు చదువుకుంటున్న పిల్లలకు సైతం లబ్ధి చేకూరుతుంది. విజయ డెయిరీకి పాలుపోస్తే లభించే రాయితీ, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. రైతులు ప్రైవేట్ డెయిరీల మాయ మాటలు నమ్మి మోసపోవద్దు.