వనపర్తి, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): తాగునీటి కటకటకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. సీమాంధ్ర పాలనలో గుక్కెడు మంచినీళ్లు కావాలంటే వనపర్తి జిల్లా ప్రజలు అష్టకష్టాలు పడ్డ రోజులున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి తాగునీటి కోసం పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఇంటింటికీ నల్లా అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభకు, పార్లమెంటుకు ఎంపికైన ఏ ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల గోస పట్టించుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పోటీపడీ గెలిచినా వారికి అధికార యావ తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్న సందర్భాలు లేవు. ఇక్కడి ప్రజల కష్టాలను, కన్నీళ్లు చూసిన టీఆర్ఎస్ ప్రభుత్వం కనీస అవసరమైన మంచినీటి సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి సరిపడా తాగునీరు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా బృహత్తర కార్యక్రమాన్ని తీసుకుని విజయవంతం చేసింది. దీనిని రెండోదశలో విస్తరించి సగటున ఒక్కో వ్యక్తికి 100లీటర్ల నీటిని ప్రతిరోజు అందించనున్నారు.
రూ. 300కోట్లతో రెండో దశ
మొదటి దశలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చినప్పటికీ వర్షాలు సమృద్ధిగా కురువకపోతే వనపర్తి జిల్లాకు తాగునీటి కొరత ఏర్పడుతున్నది. ఇలా అనేక సందర్భాలు ఎదురయ్యాయి. రామన్పాడ్లో నీటి నిల్వలు తగ్గితే తాగునీటికి కష్టమయ్యేది. కొన్నేండ్ల కిందట రామన్పాడ్లో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోగా తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. విషయాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా కర్ణాటక ముఖ్యమంత్రి సదానందగౌడకు ఉత్తరం రాసి 2 టీఎంసీలు ఎగువ ప్రాంతం నుంచి విడుదలయ్యేలా చూశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను మిషన్ భగీరథ ద్వారా తీసుకువస్తే తమ జిల్లాకు తాగునీటి సమస్య తీరుతుందని చెప్పారు. దీనికోసం అనుమతి ఇవ్వాల్సిందిగా సీఎంను మంత్రి కోరారు. అడిగిందే తడువుగా రూ.300 కోట్లు మంజూరు చేశారు. దీంతో పనులు ప్రారంభించి ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తిచేశారు. మార్చి వరకు పూర్తిచేసి వేసవిలో అందుబాటులోకి తేనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో వర్షాపాతం తక్కువ పడ్డప్పటికీ నీటి కొరత రాకుండా ఉంటుంది. మిషన్ భగీరథ పథకంతో ఇప్పటివరకు వనపర్తి జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు, తండాలకు భగీరథ నీరు అందుతున్నది. రెండోదశ పూర్తయితే పుష్కలంగా తాగునీరు అందనున్నది. మొదటి దశను విస్తరిస్తూ రెండోదశను పూర్తిచేస్తున్నారు. వనపర్తి నియోజకవర్గంలోని బుగ్గతండా వద్ద దీనికి సంబంధించిన పైలాన్ ఏర్పాటు చేశారు.
ఎల్లూరు జలాశయం నుంచి..
రెండోదశ మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేసే నీటిని శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో నిర్మించిన ఎల్లూరు జలాశయం నుంచి తీసుకురానున్నారు. రామన్‌పాడ్, శంకరసముద్రం, రంగ సముద్రం, గోపాల్దిన్నె జలాశయం పూర్తిగా వ్యవసాయం కోసం వాడుకోవడం వల్ల తాగునీటికి కష్టమవుతున్నది. దీంతో ఎల్లూరు జలాశయం నుంచి నీటిని తెస్తున్నారు. టాపింగ్పాయింట్గా గౌరిదేవీపల్లి వద్ద ఏర్పాటు చేసిన సంపును చేరుకుని అక్కడి నుంచి గోపాల్పేట, బుగ్గపల్లి తండాకు చేరుకుంటాయి. దీనికి ముందు రేవల్లి గట్టు మీద నిర్మించిన ట్యాంకుకు చేరుకుని గ్రావిటీ ద్వారా ఫిల్టర్లకు చేరుకుంటాయి.
నాలుగు నియోజకవర్గాలకు ప్రయోజనం
వనపర్తిలోని 9 మండలాలు (229 ఆవాస ప్రాంతాలు), వనపర్తి,పెబ్బేరు మున్సిపాలిటీకి లబ్ధి చేకూరనున్నది. దేవరకద్రలోని 4మండలాలు, 66 ఆవాస ప్రాంతాలు, కొత్తకోట మున్సిపాలిటీ, కొల్లాపూర్‌లోని 3మండలాలు, 37 ఆవాస ప్రాంతాలు, మక్తల్‌లోని 4మండలాలకు ప్రయోజనం చేకూరనున్నది.
ఇక తాగునీటి ఇబ్బందులు ఉండవు
పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతున్నారు. ఒక్కో వ్యక్తికి సరిపడా తాగునీటి సౌకర్యం ఇవ్వాలనే లక్ష్యంతో వనపర్తి జిల్లాలో మిషన్ భగీరథ పథకం పనులు కొనసాగుతున్నాయి. మంత్రి నిరంజన్‌రెడ్డి చొరవ తీసుకుని ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించారు. మంజూరైన నిధులు సరిపోయే పరిస్థితి లేనందునా మరో రూ.75 కోట్లకు ప్రతిపాదనలు పంపాం. రెండోదశ పూర్తి అయితే వరుసగా రెండు, మూడేండ్లు వర్షాలు పడక కరువు పరిస్థితులు ఏర్పడినా.. వనపర్తి జిల్లాకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు రావు.