యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి);అన్ని వర్గాల ప్రజలు హరిత స్ఫూర్తిని చాటుతున్నారు. సందర్భమేదైనా మొక్కలు నాటడం అలవాటు చేసుకున్నారు. పుట్టిన రోజు, పెండ్లి వేడుకలు, పండుగలు, సందర్శనలు, ఇతరత్రా సందర్భాల్లోనూ విరివిగా మొక్కలు నాటుతూ హరిత సంకల్పం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా అటవీ అధికారులు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. చౌటుప్పల్ పట్టణ పరిధిలోని రిజర్వ్ ఫారెస్టులో రెండెకరాల విస్తీర్ణంలో ‘స్మృతివనం’ ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు మొక్కల ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. ఈ వనంలో చనిపోయిన వారి జ్ఞాపకంగా వందల సంఖ్యలో నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ‘యాదాద్రి మోడల్’ తరహాలో సహజ అడవుల రూపకల్పనకు మార్గదర్శకంగా నిలిచిన చౌటుప్పల్లోని ‘తంగేడు వనం’ మాదిరిగానే అటవీ శాఖ ఏర్పాటు చేసిన ‘స్మృతివనం’ సైతం ఆదర్శంగా నిలుస్తున్నది.
ఏటా సెప్టెంబర్ 11న..
అటవీ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏటా సెప్టెంబర్ 11న అటవీ అధికారులు, అమరుల కుటుంబీకులు ఇక్కడి వనంలో మొక్కలు నాటుతున్నారు. వినూత్నంగా మొదలు పెట్టిన ఈ కార్యక్రమం పది ఉపయోగపడుతూ చెరుగని జ్ఞాపకంగా నిలువడం సంతృప్తిగా ఉందంటున్నారు ఇక్కడి అటవీ ఉద్యోగులు. ఏదిఏమైనా అంతరించిపోయిన అడవుల విస్తీర్ణం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం యజ్ఞంలా చేపట్టిన హరిత సంకల్పాన్ని చౌటుప్పల్ స్మృతివనం నెరవేరుస్తున్నది.
చనిపోయినవారి పేరు మీద..
ఎంతోమంది ఇక్కడి స్మృతివనాన్ని సందర్శించి చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా మొక్కలు నాటుతున్నారు. ప్రతి మొక్క వద్ద చనిపోయిన వారి పేరుతోపాటు మొక్కను నాటిన వ్యక్తి పేరు రాయించే ఏర్పాట్లు చేశారు. దీంతో ఆ మొక్కను నాటినవారు ఎప్పుడైనా వచ్చి చూసుకునే అవకాశం కలుగుతున్నది. మొక్కను నాటేందుకు అటవీశాఖ సంబంధిత వ్యక్తుల నుంచి రూ.5 వేలు ఫీజు వసూలు చేస్తున్నది. నాటిన మొక్క.. వృక్షంగా ఎదిగే వరకు అధికారులు ఆ డబ్బును వెచ్చిస్తారు. తమ వారి పేరిట నాటిన మొక్క చెట్టుగా ఎదిగిన తరువాత వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. ఆ చెట్టు నీడన సేదదీరుతున్నారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ క్రాస్ రోడ్డు వద్ద రెండేండ్ల క్రితం అటవీ అధికారులు స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. తమ నుంచి దూరమైన వారి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునేలా స్మృతివనంలో మొక్కలు నాటేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అటవీ అధికారుల వినూత్న ఆలోచనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.