
రామగిరి, డిసెంబర్ 12 : ప్రైవేటు కళాశాలలు ఆటలను పూర్తిగా విస్మరిస్తున్నాయి. విద్యార్థుల నుంచి వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా.. క్రీడలను నామమాత్రం కూడా పరిచయం చేయడం లేదు. ఇటీవల మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన ఇంటర్ కాలేజీ టోర్నమెంట్లో 12 పురుషుల, మహిళా ఫుట్‌బాల్ జట్లు మాత్రమే పాల్గొనడం పరిస్థితికి అద్దం పడుతున్నది. 2007-08లో ఎంజీయూ ప్రారంభమైంది. నాటి నుంచి యేటా వివిధ విభాగాల్లో క్రీడలు నిర్వహిస్తున్నది. ఈ ఏడాది యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ప్రత్యేకంగా స్పోర్ట్స్ క్యాలెండర్ విడుదల చేసి ఉమ్మడి జిల్లా పరిధిలోని కళాశాలలకు పంపింది. డిసెంబర్ 1 నుంచి 30 వరకు 23 విభాగాల్లో ఇంటర్ కళాశాలల టోర్నమెంట్ జరుగనుందని, జట్లను సన్నద్ధం చేసి పంపించాలని నవంబర్ 20నే సమాచారం ఇచ్చింది.
సమాచారం ఇచ్చినా స్పందన అంతంతే..
ఎంజీ యూనివర్సిటీ స్టోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడల వివరాలను నెలరోజుల ముందే నిర్ణయించి కళాశాలలకు సమాచారం అందించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్సిటీ పరిధిలో మొత్తం 162 కళాశాలున్నాయి. వాటిలో 91 డిగ్రీ కళాశాలలు, 26 పీజీ, 34 బీఈడీ, 5 బీపీఈడీ, డీపీఈడీ కళాశాలలు, 5 ఎంబీఏ, ఒక లైబ్రరీ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలున్నాయి. వాటిలో 23 ప్రభుత్వ కళాశాలలు, గురుకుల డిగ్రీ కళాశాలలు ఉండగా మిగిలినవి ప్రైవేటువి. క్రీడల నిర్వహణపై వర్సిటీ అధికారులు కళాశాలలకు సమాచారం ఇచ్చినా స్పందన కరువైంది. వందకు పైగా ప్రైవేట్ కళాశాలున్నా క్రీడల్లో భాగస్వామ్యం లేకపోవడం కళాశాలల ధోరణికి అద్దం పడుతున్నది.
టోర్నమెంట్‌కు హాజరైన కళాశాలలివే..
ఎంజీయూలో ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల టోర్నీ ఈ నెల 1న జరిగింది. ఇందులో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు చెందిన 9 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. అదేవిధంగా ఈ నెల 2న బాక్సింగ్, 3న బాస్కెట్ బాల్ పోటీలు జరిగాయి. 7, 8న వాలీబాల్ పురుషుల, మహిళల టోర్నమెంట్‌కు ఉమ్మడి జిల్లాలోని 23 కళాశాలల నుంచి 25 జట్లు వచ్చాయి. పురుషుల టోర్నీలో 15 జట్లు, మహిళల టోర్నీలో 13 జట్లు పాల్గొన్నాయి. 5 ప్రభుత్వ కళాశాలలు, 5 గురుకుల, 2 ప్రైవేట్, 4 ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలల నుంచి ఈ జట్లు పాల్గొన్నాయి.
10న జరిగిన పుట్‌బాల్ పోటీల్లో పురుషులు, మహిళల ఆరుచొప్పున జట్లు పాల్గొన్నాయి. ప్రభుత్వ, గురుకుల కళాశాలల నుంచి, 4 ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల నుంచి ఈ జట్లు వచ్చాయి.
30 వరకు క్రీడల నిర్వహణ…
ఈ ఏడాది 30 వరకు యూనివర్సిటీ రూపొందించిన స్పోర్ట్స్ క్యాలెండర్లో ఇంకా 7 రకాల క్రీడల పోటీల నిర్వహణ మిగిలి ఉంది. (కబడ్డీ, ఖోఖో, క్రాస్‌కంట్రీ, అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, చెస్, హాకీ) పోటీలకు అన్ని కళాశాలలు తమ జట్లను పంపితే ప్రతిభ గల క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. యూనివర్సిటీ నుంచి రాష్ట్రస్థాయిలో ఆడే అవకాశం దక్కుతుంది. ఇప్పటికైనా ప్రైవేటు డిగ్రీ, పీజీ, అనుబంధ కళాశాలలు ఆటల దిశగా ఆలోచిస్తే మున్ముందు ఎంజీయూ పరిధిలో జరిగే క్రీడలకు కళ వచ్చే అవకాశం ఉంది.
జరుగబోయే క్రీడలకైనా పంపించాలి
ఎంజీయూలో (2021-22) విద్యా సంవత్సరంలో నిర్వహించే క్రీడా క్యాలెండర్‌ను విడుదల చేసి వర్సిటీ వెబ్ సైట్లో ఉంచాం. క్రీడా పోటీల నిర్వహణపై అన్ని కళాశాలలకు సమాచారం ఇచ్చాం. కళాశాలలు ఎందుకు హాజరుకాలేదో అర్థం కావడం లేదు. విషయాన్ని వీసీ దృష్టి తీసుకువెళ్తాం. క్యాలెండర్లో మిగిలి క్రీడా అంశాల్లో పాల్గొనేందుకైనా కళాశాలలు క్రీడాకారులను పంపాలి. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు వసతులు కల్పిస్తున్నాం. ఎంజీయూలో సుందరమైన క్రీడా స్థలాలు నిర్మించాం. విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.