స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున రాక
వైభవంగా నిత్యకల్యాణం
శ్రీవారి ఖజానాకు రూ. 30,22,246 ఆదాయం
యాదాద్రి, డిసెంబర్ 12 : యాదాద్రి లక్ష్మీ సమేతుడైన నరసింహ స్వామి దర్శనానికి భక్తులు ఆదివారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో బాలాలయ సముదాయాలు, మొక్కు పూజలతో మండపాలు కిక్కిరిసిపోయాయి. వరుస సెలవులు రావడంతో భక్తులు కుటుంబసమేతంగా స్వామిని దర్శించుకున్నారు. రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించలేదు. స్వామి వారి పాదాల నుంచి కుడివైపు గల పాత గోశాల పార్కింగ్ వరకు మాత్రమే వాహనాలను అనుమతిచ్చారు. స్వామి వారి ధర్మదర్శనానికి 2గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామి, అమ్మవార్ల నిత్య పూజల కోలాహలం తెల్లవారుజామున 4గంటల నుంచి మొదలైంది. సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. సుదర్శన నారసింహ హోమంతో శ్రీవారిని కొలిచారు. ప్రతిరోజూ నిర్వహించే స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. కొండకింద పాతగోశాల వద్ద వ్రత మండపంలో జరిగిన సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతమాచరించారు. 224జంటలు వ్రతాల్లో పాల్గొన్నారు. పూర్వగిరి(పాతగుట్ట) లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నిత్యపూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు ఆదివారం రూ. 30,22,246 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
31వరకు అన్నప్రసాదం నిలిపివేత
యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు నిర్మించిన మొదటి ఘాట్‌రోడ్డు పునర్నిర్మాణ పనులు సాగుతున్నందున చినజీయర్ కుటీర్‌లో భక్తులకు ఉచితంగా అందించే నిత్యాన్న ప్రసాదం ఈ నెల 31వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు.