ఇక్కడేమైనా ఆపిల్స్ పండుతయా..
బెదిరింపులకు కేసీఆర్ భయపడడు..
సీఎం ఆధ్వర్యంలో ఢిల్లీ వరకు పోరాటం
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎంతటి బెదిరింపులకైనా సీఎం కేసీఆర్ లొంగే వ్యక్తి కాదని కేంద్రంపై పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆగమైన తెలంగాణ రైతన్న రాష్ట్రం సిద్ధించాక సాగునీటి రంగాన్ని బలోపేతం చేసుకునడం వల్ల సమృద్ధిగా పంటలు పండించుకుంటున్నారని తెలిపారు. అన్నదాతలు కష్టపడి పండించిన వరి పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రం నిరాకరించడం అన్యాయమన్నారు. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వడ్లు కొనాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తా నుంచి ఎడ్ల బండ్లపై భారీ ర్యాలీగా జెడ్పీ మైదానానికి చేరుకున్నారు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా 2014లో ప్రచారానికి పాలమూరు వచ్చిన నరేంద్ర మోడీ.. సుష్మా స్వరాజ్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కర్ణాటకలోని రాయచూరు బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలో కలపమంటున్నాడని, నిజామాబాద్ సమీపంలో 25 మహారాష్ట్ర గ్రామాలు కూడా తెలంగాణలో కలపాలని తీర్మానం చేశాయని గుర్తు చేశారు. ఇక్కడ జరుగుతున్న అభవృద్ధి, సంక్షేమ పనులు మీరెందుకు చేయడం లేదని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ రూ.46వేల కోట్ల పన్నులు కడితే కేంద్రం కేవలం రూ. 25వేల కోట్లు మాత్రమే తిరిగి ఇస్తున్నదన్నారు. మేము కట్టిన పన్నుల కన్నా డబుల్ డబ్బులు కేంద్రం మాకు ఇస్తే వారు మాట్లాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇక్కడి భూముల్లో ఏ పంటలు పండుతాయో.. వాటినే పండిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ ఏమైనా ఆపిల్ పండుతుందా..మేము వరి పంట సాగు చేస్తే.. మీరు కొనం అంటే ఎట్లా.. అని కేంద్రం తీరును నిరసించారు. భవిష్యత్‌లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవ్వడంతో పాటు గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేస్తే ఊహించని విధంగా పంట దిగుబడి వస్తుందని అప్పుడు ఇలాగే అంటే రైతుల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. పంజాబ్‌లో ధాన్యం కొంటూ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు.
రైతులకు తాము ఉచిత విద్యుత్ ఇస్తుంటే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించి అన్నదాతకు అన్యాయం చేయాలని కేంద్రం చూస్తోందని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సాగునీటి రాకతో గతంలో ఎప్పుడు లేనంత వరి దిగుబడి అవుతోందని మంత్రి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో వరి ధాన్యం కొనాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. లేదంటే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేంద్రం తీరును ఢిల్లీ వరకు ఎండగడతామన్నారు. బీజేపీ నేతలకు ఒకటి కాదని రెండు మూడు నాలుకలున్నాయని అందుకే ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారని మంత్రి ఆరోపించారు. రైతు ధర్నాకు జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణమ్మ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ పార్టీ నేతలు జూపల్లి భాస్కర్ రావు, చెరుకుపల్లి రాజేశ్వర్, కేఎస్ రవికుమార్, కాడం ఆంజనేయులు, కె.రాములు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పార్టీ నేతలు, రైతులు పాల్గొన్నారు.