ఇప్పటికే వరంగల్‌లోని లక్ష్మీపురం వద్ద 6.22 ఎకరాలు కేటాయింపు
ఎమ్మెల్యే నన్నపునేని చొరవతో నిధులు మంజూరు
నర్సంపేట, వర్ధన్నపేటలోనూ త్వరలోనే పనులు
ప్రజలకు ఒకే కాంప్లెక్స్‌లో లభించనున్న మాంసం, కూరగాయలు, పండ్లు, పూలు
వరంగల్, సెప్టెంబర్ 12(నమస్తేతెలంగాణ) :సమీకృత మార్కెట్ల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే అధికారయంత్రాంగం రూ.24 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. త్వరలోనే వరంగల్ ప్రజలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందుబాటులోకి రానున్నది. ఇక్కడి లక్ష్మీపురం మార్కెట్ స్థలం 6.22 ఎకరాల్లో నయా మార్కెట్ నిర్మాణానికి నాంది పడింది. ఇక్కడ మార్కెట్‌కు గత ఏప్రిల్ 12న రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. టెండర్ పూర్తయిన తరుణంలో త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సమీకృత మార్కెట్లు అందుబాటులోకి వస్తే మాంసం, చేపలు, కూరగాయలు, గుడ్లు, పూలు, పండ్లు ఒకేచోట లభించనున్నాయి.
వరంగల్‌లోని లక్షీపురం వద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. అధికారులు ఇప్పటికే మార్కెట్ల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. మున్సిపల్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు రూపొందించి ఇటీవల ప్రభుత్వానికి పంపగా నిధులు మంజూరయ్యాయి.ఇంజినీరింగ్ అధికారులు టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఈ నిధులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో వరంగల్‌తో పాటు నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నాయి.
లక్ష్మీపురం వద్ద..
జిల్లా కేంద్రమైన వరంగల్‌లో తొలివిడుత లక్ష్మీపురం వద్ద మోడ్రన్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చొరవతో రూ.24 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో నిర్మాణ పనులు చేపట్టేందుకు లక్ష్మీపురం వద్ద ఉన్న మార్కెట్ స్థలంలో 6.22 ఎకరాలు కేటాయించగా, గత ఏప్రిల్ 12న రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. శంకుస్థాపన జరిగిన వెంటనే మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు రూ.24 కోట్లతో మోడ్రన్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఏజెన్సీ నిర్మాణ పనుల టెండర్‌ను దక్కించుకుంది. కొద్దిరోజుల క్రితం టెండర్ ఖరారు కావడంతో ఇంజినీరింగ్ విభాగం అధికారులు త్వరలో మార్కెట్ నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయితే ఒకే కాంప్లెక్స్‌లో వినియోగదారులకు అవసరమైన వెజ్, నాన్‌వెజ్ వస్తువులన్నీ లభించే అవకాశం కలుగుతుంది. కాగా, వరంగల్‌లో మరోచోట కూడా మోడ్రన్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది.
రెండు మున్సిపాలిటీల్లో కూడా..
జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నర్సంపేట మున్సిపాలిటీకి రూ.4.50 కోట్లు, వర్ధన్నపేట మున్సిపాలిటీకి రూ.2 కోట్లు మంజూరు చేసింది. దీంతో అధికారులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం కోసం నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఈ రెండు పట్టణాల్లో మార్కెట్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇటీవల టెండర్ల ప్రక్రియ జరిపారు. నర్సంపేటలో రూ.4.50 కోట్లతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి శంకుస్థాపన చేయగా, వర్ధన్నపేటలో పనులు ప్రారంభించాల్సి ఉంది.