యాచారం, జనవరి 12 : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. ఒకప్పుడు విశాలమైన భవనం, 30 పడకల దవాఖాన, 24 గంటల వైద్య సేవలు, అన్ని విభాగాల వైద్య నిపుణులతో పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించింది. మరిన్ని మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పెంచుతూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాడు 30 పడకల దవాఖాన..
మండల కేంద్రంలో విశాలమైన ప్రాంగణంలో సాగర్ రహదారి పక్కనే విశాలమైన గదులతో, అన్ని వసతులతో 30 పడకల సామర్థ్యంతో సుమారు 35 ఏండ్ల కిందే నిర్మించారు. 1987లో అప్పటి ఆరోగ్యశాఖా మాత్యులు డి. వేంకటేశ్వరరావు… జిల్లా మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కే సత్యనారాయణ సమక్షంలో దవాఖాన భవనాన్ని ప్రారంభించారు. దవాఖానలో మెడికల్ ఆఫీసర్‌తో పాటు గైనకాలజిస్టు, డెంటల్ డాక్టర్, కంటి వైద్యుడు, లేడీ డాక్టర్, ఆయుర్వేద డాక్టర్, చిన్న పిల్లల వైద్యులు, జనరల్ ఫిజీషియన్, ల్యాబ్‌టెక్నీషియన్స్, స్టాఫ్ నర్సులు, అటెండర్లు, ఫార్మసిస్టులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేవారు. దవాఖానకు యాచారం మండల గ్రామాల ప్రజలే కాకుండా మంచాల, ఆమన్‌గల్లు, మాడ్గుల, కందుకూరు మండలాల ప్రజలు తరచూ ప్రభుత్వ దవాఖానకు వచ్చి వైద్యం చేయించుకునేవారు. ఇక్కడున్న వసతులు, వైద్య సేవలు చుట్టు పక్కల ఎక్కడా లేకపోవడంతో దవాఖానకు మంచి ఆదరణ ఉండేది. నిత్యం వందల సంఖ్యల రోగులతో దవాఖాన కిటకిటలాడేది.
ఉన్నత స్థాయి నుంచి ప్రాథమిక స్థాయికి..
ఉన్నత స్థాయిలో పేదలకు మెరుగైన వైద్యం అందుతుందన్న తరుణంలో ఇబ్రహీంపట్నంలో మోడల్ పీహెచ్‌సీని నిర్మిస్తూ అప్పటి కలెక్టర్ వాణీప్రసాద్ యాచారం దవాఖానను ఉన్నత స్థాయి నుంచి ప్రాథమిక స్థాయికి తగ్గించారు. దీంతో వైద్యులు, సిబ్బంది సంఖ్య తగ్గడంతో పాటుగా వైద్య సేవలు సైతం తగ్గాయి. 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన వైద్యులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకే అందుబాటులో ఉంటున్నారు. గతంలో 50 మందికిపైగా సిబ్బంది విధులు నిర్వహించగా, ముగ్గురు వైద్యులు, 25 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సెలవుల్లో పేదలకు సరైన వైద్యం అందడంలేదని రోగులు వాపోతుండేవారు. అత్యవసర సేవలకు ఇబ్రహీంపట్నం లేదా హైదరాబాద్‌కు వెళ్లాల్సిందేనని వాపోతున్నారు. పలువురు వైద్యులు. సిబ్బంది డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఎక్స్‌రేతో పాటు ఇతర ల్యాబోరేటరీ పరికరాలు ప్రస్తుతం తుప్పుబట్టి మూలకుపడ్డాయి. దవాఖాన భవనం 35 ఏండ్ల కింద నిర్మించడంతో ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నది. పైకప్పు నుంచి నీరు కిందికి దిగడంతో పెచ్చులూడుతున్నాయి. దీంతో వైద్యులు, రోగులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్లు భవనాన్ని పరిశీలించారు. తాత్కాలిక మరమ్మతులకు కృషి చేయనున్నట్లు తెలిపారు.
నేడు రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ పరిధిలోకి..
ప్రభుత్వ దవాఖానను ప్రాథమిక స్థాయి నుంచి తిరిగి ఉన్నత స్థాయికి మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్సీ నంబర్ 7182 ప్రకారం గత నెల 30న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఇకపై రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ పరిధిలోకి రానున్నది. తిరిగి 24 గంటలు వైద్య సేవలు, అన్ని విభాగాలకు చెందిన 10 మందికి పైగా వైద్య నిపుణులు, అధికంగా సిబ్బంది, అన్ని రకాల వైద్య సేవలు, అన్ని రకాల వైద్య పరీక్షలు, అన్ని రకాల ఆధునిక వైద్య పరికరాలు తిరిగి అందుబాటులోకి రానున్నాయి. దీంతో జనరల్ ఓపీ గతంలా మరింతగా పెరుగనున్నది. ఇకపై అత్యవసర వైద్య సేవలను సైతం ఇక్కడే పొందవచ్చును. ప్రస్తుతం డీఎంహెచ్‌వో పరిధిలో ఉన్న వైద్య సిబ్బందిని పూర్తిగా బదిలీ చేసి రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ పరిధిలో పని చేస్తున్న వైద్య నిపుణులు, సిబ్బందిని ఇక్కడ నియమించనున్నారు.
స్థాయి పెంచడం సంతోషంగా ఉన్నది..
యాచారం ప్రభుత్వ దవాఖాన స్థాయి పెంచడం ఎంతో సంతోషంగా ఉన్నది. ప్రస్తుతం తిరిగి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి రాష్ట్ర వైద్య విధాన పరిషత్ పరిధిలోకి మార్చడంతో దవాఖానకు పూర్వవైభవం రానున్నది. రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ద చూపుతున్నది. ప్రభుత్వ దవాఖాన నూతన భవనాన్ని అన్ని రకాల హంగులతో త్వరలో నిర్మించాలి.-కొప్పు సుకన్య ఎంపీపీ, యాచారం
వైద్య సేవలను విస్తరిస్తాం..
రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలను మరింతగా విస్తరింపజేస్తాం. పేదల ఆరోగ్య సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు, మండల స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నియోజకవర్గస్థాయిలో మోడల్ పీహెచ్‌సీలను ఏర్పాటు చేసి వైద్య సేవలను అందిస్తున్నది. యాచారం దవాఖాన భవన నిర్మాణానికి కృషి చేస్తా.-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే