
పెరిగిన డీజిల్ ధరలతో రైతన్నలపై మరింత భారం
వరికి ఖర్చు ఎక్కువ.. లాభం తక్కువ
ఆరుతడి పంటలతో అధిక లాభాలు
సుజాతనగర్, డిసెంబర్ 11;ముప్పేట పెరిగిన ధరలతో రైతులు వరి సాగుకు బదులు ఇతర పంటలే మేలని భావిస్తున్నారు. అందుకే ఈ యాసంగిలో ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపుతున్నారు. వరి ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే రూ.40 వేల వరకు ఆదాయం వస్తుంది. అంటే ఆరుగాలం కష్టపడితే ఎకరాకు మిగిలేది కేవలం రూ.10 వేలు. అదే పెసర, కంది వంటి ఇతర పంటలకు క్వింటాకు ఎనిమిది వేల వరకు వస్తుండటంతో రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
వరి సాగులో దుక్కి దున్నడం మొదలుకొని పంట కోత కోసే వరకు ట్రాక్టర్పైనే ఆధారపడుతున్నారు. ఒకవైపు వాతావరణ ప్రతికూలతలు, మరోవైపు కూలీల కొరతతో రైతన్నలు యంత్రాలపై ఆధారపడకుండా ఉండలేని పరిస్థితి. అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆరుగాలం కష్టించే అన్నదాతపై మోయలేని భారం పడుతున్నది. రైతుబంధు, ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబీమా లాంటి పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తుంటే.. నియంత్రణలేని డీజిల్ ధరలతో కేంద్రం మాత్రం రైతుల నడ్డి విరుస్తున్నది. ప్రస్తుతం వానకాలంలో భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 1,74,945 ఎకరాల్లో వరిసాగు చేపట్టగా, ఇప్పటివరకు 50శాతం కోతలు పూర్తయ్యాయి. పెరిగిన డీజిల్ ధరలతో వరికోత మిషన్ల యజమానులు కూడా ధరలు పెంచారు. గతేడాది గంటకు 2,700 ఉండగా ప్రస్తుతం రూ.3500 వరకు తీసుకుంటున్నారు. ట్రాక్టర్ కిరాయి సైతం భారీగా పెరిగింది. గతంలో స్థానికంగా రూ.500 ఉంటే ప్రస్తుతం రూ.వెయ్యి అయింది. ఇతర గ్రామాల నుంచి ధాన్యం తేవాలంటే రూ.4 వేల వరకు కిరాయి చెల్లించాల్సిందే. ప్రస్తుతం వరి కోత మిషన్లు ట్రాక్టర్ కిరాయిలు కలిపి ఎకరానికి రూ.5 వేలు చెల్లించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాక్టర్ కిరాయిలు పెరిగాయి..
వానకాలం 5 ఎకరాల్లో వరిసాగు చేశాను. కనీసం రూ.2 లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదు. రూ.1.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. ఈ సారి పంటకు రోగాలు వచ్చి రెండు, మూడు సార్లు మందులు కొట్టాల్సి వచ్చింది. డీజిల్ ధర పెంపుతో ట్రాక్టర్ కిరాయిలు భారీగా పెరిగాయి. వరికోత మిషన్ ధరల పెంపు కూడా భారంగా మారింది.
రైతుల నడ్డి విరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు డీజిల్, పె ట్రోల్, గ్యాస్ ధరలు పెంచి నడ్డి విరుస్తున్నది. రైతు వ్యతిరేక విధానాలు తెస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుంటే కేంద్రం మాత్రం భారం మోపుతున్నది.