నేటి ధర్నాను విజయవంతం చేయాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు
హనుమకొండ, నవంబర్ 11 : కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతులు పండించిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయడంతోపాటు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేదాకా ఆందోళనలు కొనసాగిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. గురువారం సాయంత్రం హనుమకొండ రాంనగర్‌లోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనేందుకు బీజేపీ సర్కారు నిరాకరిస్తున్నందుకు నిరసనగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలమేరకు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆందోళన, నిరసన కార్యక్రమాలు ఉంటాయని ఇందులో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమైక్యపాలనలోని తెలంగాణకు, ఏడేళ్ల తెలంగాణకు తేడా ఏముందో రైతులు విశ్లేషించుకోవాలని విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ.. వ్యవసాయ రాష్ట్రంగా మారిందన్నారు. కాళేశ్వరం, దేవాదులతోపాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులకు మరమ్మతులు చేసి, చెక్‌డ్యాముల నిర్మించడం ద్వారా భూగర్భ జలాలు పెంచిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులకు గానీ, ఉచిత విద్యుత్తు వంటి వాటికి కేంద్రం ఒక్క రూపాయన్న సాయం చేసిందా? అని ప్రశ్నించారు. ఇతర రాష్ర్టాలకు సహకరిస్తున్న కేంద్రం తెలంగాణ రైతాంగానికి, రాష్ర్టానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాలకు ఒక న్యాయం.. తెలంగాణకు ఒక న్యాయమా అని మండిపడ్డారు. కేంద్రంతో ఘర్షణ పెట్టుకోవాలని తమకు ఏనాడూ లేదన్నారు. అసలు బండి సంజయ్, కిషన్‌రెడ్డి మాటలకు పొంతనే లేదన్నారు. కొత్త రైతు బిల్లులోని వాస్తవ అంశాలు బయటకి వచ్చినప్పుడు ప్రజలు బీజేపీ నాయకులను ఉరికించి కొడుతారన్నారు. రైతుబిడ్డ కేసీఆర్ అని, రైతులు సమస్యలు తెలిసిన వ్యక్తిగా రైతుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు లాంటి వివిధ పథకాలు రూపొందించి అమలుచేస్తున్నారని వివరించారు. రైతులు సైతం పెద్ద సంఖ్యలో ఈ నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని బీజేపీ నాయకులను నిలదీయాలని మంత్రి సూచించారు. నల్లచట్టాలను వెనక్కి తీసుకునే వరకూ పోరాటం కొనసాగించాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు టి.రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి.ప్రకాశ్ పాల్గొన్నారు.
రైతాంగాన్ని దగా చేస్తున్న బీజేపీ