కిటకిటలాడిన భక్తజనం.. పాల్గొన్న ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రజాప్రతినిధులు
మొయినాబాద్, జనవరి 9 : చిలుకూరు సురంగటి భ్రమరాంబ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది స్వామివారి గర్భగుడి ఎదుట కల్యాణం చేసేవారు. కానీ స్థలం సరిపోవడంలేదని.. ఆలయం పక్కన గల బహిరంగ స్థలంలో కొత్తగా నిర్మించిన కల్యాణ వేదికపై నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు.. భక్తజన సందోహం మధ్య కల్యాణోత్సవం జరిగింది. మండలంలోని పలు గ్రామాలతోపాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించారు.
ఆలయ కమిటీ చైర్మన్ సంగరి మల్లేశ్, గ్రామ పెద్దల సమక్షంలో కల్యాణం, బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు. మల్లన్నకు బోనాలు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని విధాలా ఏర్పాట్లు చేశారు. మొయినాబాద్ ఇన్స్పెక్టర్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
స్వామివారిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో సర్పంచ్ స్వరూప, ఉపసర్పంచ్ సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంజుల, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయంత్, మాజీ ఉపసర్పంచ్లు ఆండ్రూ, గోపాల్‌రెడ్డి, నర్సింహగౌడ్, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు శ్రీరాములు, ఉపాధ్యక్షుడు రాజు, కేతిరెడ్డిపల్లి ఎంపీటీసీ అర్చన, వార్డు సభ్యులు పాల్గొన్నారు.