
‘ఆపి’ అధ్యక్షురాలు డాక్టర్ అనుపమ
వెంగళరావునగర్, జనవరి 9 : దేశంలో అత్యధిక శాతం మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని, ఇది ఆందోళనకరమని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఆపి) అధ్యక్షురాలు డాక్టర్ అనుపమ అన్నారు. ఆదివారం శ్రీనగర్ నగర్ కాలనీలోని తన్వీర్ దవాఖానలో ఆపి, తన్వీర్ ఫౌండేషన్ సంయుక్తంగా బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అనుపమ మాట్లాడుతూ.. పాశ్చాత్య దేశాల్లో సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహన పెరుగడంతో కేసులు తక్కువగా వస్తుంటాయని, కానీ మన దేశంలో మాత్రం ఈ వ్యాధి సర్వసాధారణమైందని ఆందోళన వ్యక్తం చేశారు. బాలికలు టీనేజీలో ఉన్నప్పుడే హెచ్పీవీ వ్యాక్సిన్ వేసుకుంటే.. సర్వైకల్ క్యాన్సర్ రాదన్నారు. ఉచితంగా ఇర్వహిస్తున్న ఈ క్యాంపులో తాము 100 మంది బాలికలకు వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆపి ఎలక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి కొల్లి, ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘునందన్, డాక్టర్ సురేంద్రనాథ్, ఆపి ఉమెన్ ఫోరం నుంచి డాక్టర్ మెహర్ మేడవరం, ఆపి కన్వీనర్ డాక్టర్ దువ్వూరు ద్వారకానాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.