రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా దవాఖాన నెం.1
ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 9573 ప్రసవాలు
ఒక్క అక్టోబర్‌లోనే 1819 డెలివరీలు
సంగారెడ్డి మున్సిపాలిటీ, నవంబర్ 8 : తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలతో ప్రజల్లో సర్కారు వైద్యంపై నమ్మకం ఏర్పడింది. కేసీఆర్ కిట్, ఆడ బిడ్డ పుడితే రూ.13 వేలు, మగ బిడ్డ పుడితే రూ. 12వేలు, అమ్మ ఒడి, అంబులెన్స్ తదితర కార్యక్రమాలు సత్ఫలితాలిస్తుండగా, ప్రభుత్వ వైద్యంపై భరోసా పెరిగింది. దీంతో రాష్ట్రంలోనే ప్రసవాల్లో సంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అమ్మ ఒడి వాహనం ద్వారా ప్రసవానికి ఇంటి నుంచి ప్రభుత్వ దవాఖానకు తీసుకురావడం, కాన్పు తర్వాత ఇంటి వద్దకు చేరవేయడం వంటి పథకాల ద్వారా నయా పైసా ఖర్చులేకుండా ప్రభుత్వ సేవలందిస్తున్నందుకు ప్రభుత్వ దవాఖానల్లో మహిళలు కాన్పులు చేయించుకుంటున్నారు. రాష్ట్రంలోనే ప్రసవాల్లో సంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని డీఎంహెచ్‌వో గాయత్రీదేవి ప్రకటించారు. అందులో నార్మల్ డెలివరీలు చేయడంలో జిల్లా నెంబర్ వన్‌గా నిలవడం గమనార్హం. జిల్లాలో ఈ యేడాది ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ వరకు మొత్తం 9,573 డెలివరీలు జరిగాయి. ఇందులో నార్మల్ డెలివరీలు 6,490 కాగా, సీజేరియన్ 3,083 డెలివరీలు అయ్యాయి. అత్యధికంగా అక్టోబర్ నెలలో 1,810 కాన్సులు జరగడం విశేషం. అయితే ఈ యేడాది ఏప్రిల్ నెలలో 1,126 డెలివరీలు, మేలో 1,075, జూన్‌లో 1,163, జూలైలో 1,209, ఆగస్టులో 1,531, సెప్టెంబర్‌లో 1,659, అక్టోబర్‌లో 1,810 కాన్పులు జరిగాయి. మొత్తం జిల్లాలో 9, 573 డెలివరీలు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం విశేషం.
రాష్ట్రంలో ప్రథమస్థానం సంతోషకరం
జిల్లాలోని మాతా శిశు రక్షణ కేంద్రంతో సహా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ నెల వరకు 9,573 డెలివరీలు జరిగాయి. ఇందులో 6,490 నార్మల్, 3,083 సీజేరియన్ డెలివరీలు అయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నార్మల్ డెలివరీలు చేసి ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణం. ఒక్క అక్టోబర్‌లోనే 1,810 కాన్పులు జరగం విశేషం. జిల్లా నార్మల్ డెలివరీలు మరింత పెంచేందుకు కృషి చేస్తాం. జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి ధన్యవాదాలు.