కొబ్బరి పీచు, కోకోపీట్ తయారీతో ఉపాధి
ఇతర రాష్ర్టాలకూ ఎగుమతి
కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ల
కాదేదీ కవితకు అనర్హం..
హీనంగా చూడకు దేన్నీ..
కవితామయమేనోయి అన్నీ.. అన్నారు శ్రీశ్రీ..
హయత్‌నగర్ రూరల్, జనవరి 8: అచ్చం అలాగే వ్యాపారానికి పనికిరానిదంటూ ఏదీ లేదని నిరూపిస్తున్నారు కొందరు వ్యాపారులు. తాగి పడేసిన కొబ్బరి బొండాల నుంచి పీచు, కోకోపీట్‌ను తయారుచేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. వారితోపాటు మరో పదిమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు.కూలీలతో పొద్దున్నే హైదరాబాద్‌తోపాటు శివారులో ఖాళీ బొండాలను సేకరిస్తారు. వాటిని ప్రత్యేక యంత్రాల్లో వేయగా కొంత పీచు, మరికొంత కోకోపీట్గా మారుతుంది. ఇలా వచ్చిన పీచును సోఫాసెట్లు, పరుపులు, మెత్తలు, విగ్రహాల తయారీకి ఉపయోగించగా, కోకోపీట్‌ను నర్సరీలు, పంట పొలాలకు ఎరువుగా వినియోగిస్తుంటారు. కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని పీచు, కోకోపీట్‌ను సరఫరా చేస్తున్నారు. ఇతర రాష్ర్టాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు.
తాగి పడేసిన కొబ్బరి బొండాలతో కొందరు స్వయం ఉపాధి పొందుతూ మరి కొందరికి పని కల్పిస్తున్నారు. పనికి రానిదంటూ ఏదీ ఉండదని నిరూపిస్తున్నారు…నిత్యం తెల్లవారుజామునే ఇద్దరు కూలీలతో వెనుక ట్రాలీలు ఉండే వాహనాల్లో డ్రైవర్లు నగర శివారునుంచి బయలుదేరుతాయి. హైదరాబాద్ నగరంతోపాటు శివారులో కొబ్బరి బొం డాలు విక్రయించే అడ్డాల వద్ద ఆగుతాయి. అందులోని కూలీ లు దిగి అక్కడ తాగి పడేసిన బొండాలను ఆ వాహనాల్లో నింపుకొని, తిరిగి బయలుదేరిన ప్రదేశానికే చేరుకుంటాయి. ఒక్కో వాహనంలో దాదాపు మూడు టన్నుల వరకు బొం డాల నింపుతారు. అలా తీసుకొచ్చిన బొండాలను యంత్రా ల్లో వేస్తారు. దాని నుంచి పీచు విడిగా పడుతుంది. మిగిలిన దాంట్లో కొంచెం కోకోపీట్ (ఎరువు)గా మారి మరో చోట చేరుతుంది. మిగిలిన కొబ్బరి చిప్పలు, ఇతర వ్యర్థాలు మరో మూ లనపడిపోతాయి. తాగి పడేసిన కొబ్బరి బొండాలతో కొందరు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతూ మరి కొందరికి పని కల్పిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో కొబ్బరి బొండాలు పెద్దగా దొరకవని చెప్తున్నారు పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీకి చెందిన వ్యాపారి రఘునందన్‌రెడ్డి. ఎండాకాలంలో బొండాలు ఎక్కువగా దొరుకుతాయని, చలి, వానకాలాల్లో వీటిని తాగేవారు తక్కువగా ఉంటారని పేర్కొంటున్నారు. తన వద్ద ఐదుగురు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. బొండాలను యంత్రాల్లో వేయడం వల్ల అవి నలిగి పీచు బయటకు వస్తుందని, అందులోని కొంత మొత్తం మరింత మెత్తగా, పొడిగా మారి (కోకాపీట్) ఎరువులా మారుతుందన్నారు. ప్రతిరోజూ ఒక లోడ్ (మూడు టన్నుల) బొండాల నుంచి పీచు తయారు చేస్తున్న ట్లు వివరించారు. తనతో పలువురు వ్యాపారులు, కార్పొరేట్ కంపెనీల నిర్వాహకులు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. ఆయా కంపెనీల్లో వినియోగించే సోఫాల తయారీకి పీచును, అక్కడి గ్రీనరీ కోసం కోకాపీట్ను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. బొండాలను కృత్రిమంగా తయారుచేయడానికి వీల్లేదు. అందు కే వాటి వినియోగం పెరిగినప్పుడే పీచు తయారీని పెంచుతున్నామని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కాయిర్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు 15 వరకు ఉన్నాయి.
ప్రభుత్వం రాయితీలు కల్పించాలి
రోజులో ఒక షిఫ్ట్ (8 గంటలు)కు 2.5 టన్నుల పీచు రాగా, కోకోపీట్ 12 టన్నుల వరకు వస్తుంది. పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ర్టాలకు వాటిని ఎగుమతి చేస్తున్నా. గత మూడు దశాబ్దాలుగా ఈ పనినే చేస్తున్నా. మొదట్లో కొబ్బరి కాయలపై ఉండే పొట్టుతో వ్యాపారం చేశా. వాటి కొరత ఏర్పడటంతో కొబ్బరి బొండాల నుంచి పీచు తయారుచేస్తున్నా. హైదరాబాద్ నగరంలో తాగిపడేసిన కొబ్బరి బొండాలను ప్రతిరోజూ వాహనాల్లో వెళ్లి ఇక్కడికి తీసుకొచ్చి యంత్రాల్లో వేస్తాం. ఆర్డర్‌ను బట్టి సంస్థలు, కంపెనీలకు సరఫరా చేస్తున్నా. కుటుంబంతోపాటు మరో 12 మంది ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం కూడా రాయితీలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి.
రోజుకు దాదాపు నాలుగు టన్నుల కోకోపీట్
ప్రభుత్వం ఓ క్లస్టర్‌ను ఏర్పాటు చేసి కాయిర్ బోర్డు ద్వారా రాయితీలు కల్పించాలి. ఇందులో డ్వాక్రా మహిళా సంఘాలను అనుసంధానం చేయడం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. వనరులు పెరిగి కొత్త వ్యాపారులు పుట్టుకొస్తారు. ఆదాయమూ పెరుగుతుంది. కొంతమంది తాగేసిన కొబ్బరి బొండాలను డంపింగ్ యార్డుల్లో వేస్తున్నారు. దీంతో యార్డులు త్వరగా నిండుతున్నాయి. దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది. కోకోపీట్ సరఫరా కోసం మల్లారెడ్డి సంస్థలు, మెఘా తదితర కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నా. వాటితోపాటు హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని పలు కంపెనీలకు కూడా పీచును ఎగుమతి చేస్తున్నా. రోజుకు దా దాపు 1000 నుంచి 1200 కిలోల కొబ్బరి పీచును, 3 టన్నుల నుంచి 4 టన్నుల వరకు కోకోపీట్‌ను తయారు చేస్తున్నాం. ఆక్సిజన్ ప్లాంట్లలోనూ ఆక్సిజన్ తయారీ కోసం పీచును వినియోగిస్తున్నారు. కోకోపీట్ నాలుగేండ్లలో, పీచు రెండేండ్లలోనే మట్టిలో కలిసిపోతుంది. టీఎస్ కాయిర్ ఇండస్ట్రీ అసోసియేషన్‌ను 35 మంది సభ్యులతో కలిసి ఏర్పాటు చేసుకున్నాం. – నాగేశ్వర్రావు, కాయిర్ మాన్యుఫాక్చరింగ్ వ్యాపారి, పసుమాముల, పెద్ద అంబర్‌పేట
పెద్ద అంబర్‌పేట నుంచి..
పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పరిధితోపాటు హయత్‌నగర్, నగర శివారు ప్రాంతాల్లో తయారవుతున్న పీచును ఇతర రాష్ర్టాలకు వ్యాపారులు సరఫరా చేస్తున్నారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు హర్యానా, పశ్చిమబెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నది. కొబ్బరి పీచుతోపాటు కోకోపీట్కు మంచి గిరాకీ ఉన్నది. చిన్న మొత్తంలో కావాల్సిన వారు నేరుగా ఉత్పత్తి కేంద్రాల వద్దకు వస్తుండగా… ఎక్కువ మొత్తంలో అవసరమైన వారు ఆర్డర్లు ఇస్తున్నారు.