
పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
వార్డు ఆఫీసర్లు, స్వచ్ఛ కార్మికులతో సమావేశం
పీర్జాదిగూడ, డిసెంబర్ 4 : పచ్చదనం, పరిశుభ్రతలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని, అదే స్ఫూర్తితో పని చేయాలని మేయర్ జక్క వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ పీర్జాదిగూడలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని కోరారు. ఈ మేరకు శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2022’ పై వార్డ్ ఆఫీసర్లు, స్వచ్ఛ కార్మికులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేలా ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాలన్నారు.అనంతరం స్వచ్ఛ కార్మికులకు ఐడీ కార్డులు అందజేశారు. కమిషనర్ రామకృష్ణారావు, డీఈ శ్రీనివాస్, ఏఈ వినీల్ పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు సీసీలు ఏర్పాటు చేయాలి
నేరాలు, దొంగతనాలను అరికట్టడానికి సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు పై మేడిపల్లి సీఐ అంజిరెడ్డితో పాటు ఐటీ సెల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్లో సుమారు 275 నూతన కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడెక్కడ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారో గూగుల్ మ్యాపింగ్ ద్వారా పోలీస్ అధికారులు వివరించారు.అనంతరం మేయర్ మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన 400 కెమెరాల్లో పనిచేయని వాటిని ఈ నెల 10వ తేదీలోపు రిపేరు చేయించాలని అధికారులకు సూచించారు. డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, కమిషనర్ రామకృష్ణారావు, కార్పొరేటర్లు హరిశంకర్రెడ్డి పాల్గొన్నారు.