ఆత్మకూరు(ఎం), నవంబర్3 : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మంచి ఫలితాలొస్తున్నాయి. మండలంలోని తుక్కాపురం కూడా ఎంతో మార్పు సాధించింది. వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతివనం, సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు మొక్కల పెంపకంతో గ్రామ రూపురేఖలే మారిపోయాయి.
రూ.17.25 లక్షలతో అభివృద్ధి పనులు
గ్రామంలో 416 ఇండ్లు ఉన్నాయి. 1600 మంది జనాభా, 1200 మంది ఓటర్లు ఉన్నారు. పల్లె ప్రగతి కోసం ప్రభుత్వం రూ.17.25 లక్షలు విడుదల చేయగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో కంపోస్ట్ షెడ్డు, రూ.లక్షతో పల్లె ప్రకృతి వనం, రూ.5లక్షలతో సీసీరోడ్లు, రూ.లక్షతో అంతర్గత రోడ్లు నిర్మించి 40 పాత బావులను పూడ్చి వేశారు. రూ.5లక్షలతో విద్యుత్ స్తంభాలతోపాటు ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశారు.
పచ్చదనంతో పరిశుభ్రంగా..
హరితహారంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల వెంట 5వేల మొక్కలను నాటగా ఇంటింటికీ 2500 మొక్కలు పంపిణీ చేశారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించడంతో అవి ఏపుగా పెరిగి పచ్చదనం పంచుతున్నాయి. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ట్రాక్టర్ ద్వారా పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ ప్రతి ఇంటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి కంపోస్ట్ షెడ్‌కు తరలిస్తుండడంతో గ్రామం పరిశుభ్రంగా మారింది.