ప్రైవేట్ స్కూల్స్ వదిలి.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు
వికారాబాద్ జిల్లాలో 21,685 మంది చేరిక
ప్రైవేటు నుంచి వచ్చిన వారు 6,466 మంది స్టూడెంట్స్..
పరిగి, నవంబర్ 3 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న పకడ్బందీ చర్యలు ఫలించాయి. సకల సౌకర్యాలతోపాటు నాణ్యమైన విద్య అందుతుండడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేయడం, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, పక్కా ప్రణాళికతో విద్యాబోధన లభిస్తుండడంతో ప్రజలు సర్కార్ బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. వికారాబాద్ జిల్లాలోని సర్కార్ బడుల్లో ఈసారి కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. మొత్తం 21,685 మంది విద్యార్థులు చేరగా.. అందులో ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చినవారు 6,466 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 1095 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా లక్షా 11 వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
సర్కారు బడుల్లో కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య ఈసారి గణనీయంగా పెరిగింది. ప్రతి సంవత్సరం మాదిరి ఈసారి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితోపాటు ప్రైవేట్ బడుల నుంచి సర్కారు బడుల్లో చేరిన వారి సంఖ్య వేల సంఖ్యలో ఉండడం గమనార్హం. సర్కారు బడుల్లో ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేయడం, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం వంటివి కల్పిస్తుండడంతో ప్రైవేట్ బడుల్లో చదువుకుంటున్నవారు సైతం సర్కారు బడుల వైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో ఈ సంవత్సరం కొత్తగా సర్కారు బడుల్లో 21,685 మంది విద్యార్థులు చేరగా.. వారిలో ప్రైవేట్ నుంచి వచ్చినవారు 6,466 మంది ఉండడం గమనార్హం. వికారాబాద్ జిల్లా పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు 1095 ఉంటాయి. ఇందులో 90వేలకు పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండగా ఈసారి కొత్తగా 21,685 మంది చేరారు.
కొత్తగా చేరిన 21,685 మంది విద్యార్థులు
వికారాబాద్ జిల్లా పరిధిలోని సర్కారు బడుల్లో 2021-21 విద్యా సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ 27 వరకు జిల్లాలో గల 1095 పాఠశాలల్లో 21685, వారిలో ప్రైవేట్ పాఠశాలలకు చెందినవారు 6466, కొత్తగా చేరినవారు 15,219 మంది విద్యార్థులున్నారు.
కరోనా కష్టకాలం.. ప్రైవేట్ నుంచి సర్కారు బడుల వైపు..
కరోనా కష్టకాలంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవనం స్తంభించింది. ఇందులో విద్యారంగం సైతం కుదేలైంది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత విద్యా సంస్థలు ప్రారంభమైనా వేలాది మంది విద్యార్థులు ప్రైవేట్ బడులు వదిలిపెట్టి సర్కారు బడులవైపు నడిచారు. అందుకు ప్రధాన కారణం ఆయా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడడంతోపాటు ప్రైవేట్ వారు లాక్డౌన్లో ఆన్లైన్ తరగతులు సరిగ్గా నిర్వహించకున్నా, ఫీజుల కోసం తీవ్రంగా ఒత్తిడి చేయడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించారు. మరోవైపు సర్కారు బడుల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందుతున్నది. పైసా ఖర్చు లేకుండా చక్కటి విద్య అందుతుండడంతో ప్రైవేట్ బడులు మానేసి అనేక మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరారు. జిల్లావ్యాప్తంగా 6,466 మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి వచ్చి సర్కారు బడుల్లో చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు పొట్ట చేతబట్టుకొని జీవనం కోసం ఇతర జిల్లాలకు, పట్టణాలకు వెళ్లిన అనేక కుటుంబాలు కరోనా సమయంలో స్వగ్రామాలకు చేరుకున్నాయి. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత సైతం చాలామంది గ్రామాల్లోనే ఉండిపోయారు. దీంతో వారంతా తమ పిల్లలను ఆయా గ్రామాల్లోని సర్కారు బడుల్లో చేర్పించారు. గతంలో ఏడాదికి సుమారు 10వేల మంది కొత్త విద్యార్థులు చేరేవారు. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా చేరిన వారి సంఖ్య 21వేలకు పైగా ఉన్నది.