
మరింత మందికి సామాజిక భద్రత
వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తుల వెల్లువ
సంగారెడ్డి జిల్లాలో 29,695, మెదక్‌లో 16,697,
సిద్దిపేటలో 25,168 అప్లికేషన్లు
వృద్ధ్యాప్య పింఛన్ వయస్సు 57ఏండ్లకు కుదింపు
సంగారెడ్డి, నవంబర్ 3, (నమస్తే తెలంగాణ) :మలిసంధ్యలో జీవితం సాఫీగా సాగేందుకు తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంటున్నది. వారికి సామాజిక భద్రత కల్పిస్తున్నది. వృద్ధాప్య పింఛన్ వయసును 60 నుంచి 57 ఏండ్లకు కుదించడంతో పాటు కొత్త పెన్షన్ మంజూరు ప్రక్రియను వేగవంతం చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 31 వరకు అవకాశం కల్పించింది. దీంతో సంగారెడ్డి జిల్లాలో 29,695 మంది, సిద్దిపేటలో 25,168మంది, మెదక్‌లో 16,697 మంది కొత్తగా దరఖాస్తులు చేసుకోగా, త్వరలోనే మంజూరు రానున్నది. తద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో మరింత మందికి ‘ఆసరా’ దొరకనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆసరా పింఛన్ల అర్హత వయస్సును కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వృద్ధాప్య పింఛన్ల వయస్సును 54 నుంచి 57 ఏండ్లకు కుదించారు. దీంతో 57 ఏండ్ల వయస్సుదాటిన వారందరూ పింఛన్లు పొందేందుకు అర్హత సాధించారు. సీఎం కేసీఆర్ వృద్ధ్దాప్య పింఛన్ల అర్హత వయస్సును 57 ఏండ్లకు కుదించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వృద్ధాప్య పింఛన్ల వయస్సు కుదించిన నేపథ్యంలో అర్హులైన వారి నుంచి రెండు నెలలుగా ప్రభుత్వం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. గతనెల 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. కొత్తగా వృద్ధాప్య పింఛన్ల కోసం సంగారెడ్డి జిల్లాలో 29,695 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా… జహీరాబాద్ మండలం నుంచి అత్యధికంగా 2544 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. పట్టణాలతోపా టు గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలా మంది వృద్ధులు పింఛన్ల కోసం దరఖాస్తు చేశారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సును 57 ఏండ్లకు కుదించడంతో జిల్లాలో ఆసరా పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనున్నది. సంగారెడ్డి జిల్లాలో ఇది వరకే 1,39,750 మంది ప్రభుత్వం నుంచి ఆసరా పింఛన్లు అందుకుంటున్నారు.
ఆసరా పింఛన్ లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం ప్రతి నెలా రూ.31.29 కోట్లు జమ చేస్తున్నది. వృద్ధులు, వితంతవులు, ఒంటరి మహిళలు, గీతకార్మికులు, బీడీ కార్మికులకు ప్రతినెలా రూ.2016 చొప్పున పింఛన్ ఇస్తోంది. వికలాంగులు(దివ్యాంగులకు) మాత్రం ప్రతినెలా రూ.3016 పింఛన్ అందజేస్తోంది. 65 ఏండ్లు దాటిన వృద్ధులకు మాత్రమే ప్రభుత్వం పింఛన్ అందజేస్తోంది. అయితే 57 ఏండ్ల వయస్సు దాటిన వారికి పింఛన్ అందజేయాలని అర్హులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ల వయస్సును 65 నుంచి 57 ఏండ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి 57 ఏండ్ల వయస్సు వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. మీ-సేవా, ఈ- సేవా కేం ద్రాల ద్వారా 57 ఏండ్ల వయస్సు దాటిన 29,695 మంది వృద్ధులు కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా వృద్ధ్దాప్య పింఛన్ల కోసం అమీన్పూర్ మండలం నుంచి 805 మంది, అందోల్‌లో 1876, చౌటకూరులో 418, గుమ్మడిదలలో 514, హత్నూరలో 1080, ఝరాసంగంలో 1034, జిన్నారంలో 491, కల్హేర్ మండలంలో 695, కందిలో 502, కంగ్టిలో 767, కోహీర్‌లో 1407, కొండాపూర్‌లో 790, మనూరులో 675, మొగుడంపల్లిలో 896, మునిపల్లిలో 789, నాగల్గిద్దలో 757, నారాయణఖేడ్‌లో 1817, న్యాల్కల్లో 1331, పటాన్చెరులో 1805 దరఖాస్తులు వచ్చాయి. పుల్కల్ మండలం నుంచి 1022 మంది, రాయికోడ్‌లో 941, రామచంద్రాపురంలో 1928, సదాశివపేటలో 1756, సంగారెడ్డిలో 1165, సిర్గాపూర్‌లో 526, వట్పల్లిలో 1364, జహీరాబాద్‌లో 2544 మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు.
వయ స్సు గుర్తింపు పత్రం లేదా కుటుంబ సభ్యుల వయస్సు ఆధారంగా దరఖాస్తుదారుడి వయస్సు లెక్కించనున్నారు. అలాగే దరఖాస్తుదారుడు దారిద్యరేఖకు దిగువన ఉండాలి. పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామాల్లో 1.50 లక్షల సాలీన ఆదాయం ఉన్నవారు మాత్రమే కొత్త పింఛన్ పొందేందుకు అర్హులు. ప్రభుత్వ, ప్రైవేట్, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నవారు అనర్హులు. దరఖాస్తు దారులకు ఎలాంటి వ్యాపారులు ఉండకూడదు. 57 వయస్సు ఉండి, ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి అన్ని అర్హతులు ఉన్నవారికి మాత్రమే కొత్తగా ఆసరా పింఛన్ అందనున్నది. కొత్తగా వృద్ధాప్య పింఛన్ల మంజూరు తర్వాత జిల్లాలో ఆసరా లబ్ధిదారుల సంఖ్య 1.60 లక్షలు దాటే అవకాశం ఉంది. దీంతో ప్రతినెలా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసే సొమ్ము పెరగనున్నది.టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1000 ఉన్న పింఛన్‌ను రూ.2016 కు పెంచింది. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం ప్రతినెలా 1,39,750 మంది ఆసరా పింఛన్లు అందుకుంటున్నారు. ఇందులో 48,186 మంది వృ ద్ధ్దాప్య పింఛన్లు, 15,280 మంది దివ్యాంగులు, 66,855 మంది వితంతువులు, 757 మంది చేనేతకార్మికులు, 814 మంది కల్లుగీతకార్మికులు, 7369 మంది ఒంటరి మహిళలు, 94 మంది బీడీకార్మికులు, 395 మంది బోధకాలు వ్యాధిగ్రస్తులు పింఛన్లు పొందుతున్నారు.