
ఎంపీ అరవింద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
నిజామాబాద్ సీపీకి వెంటనే క్షమాపణ చెప్పాలి..
లేనిపక్షంలో గ్రామాల్లో తిరగనివ్వం.. ఇంటిని ముట్టడిస్తాం
లోయర్ ట్యాంక్‌బండ్‌లో జాతీయ మాల మహానాడు నిరసన
ఎంపీ దిష్టి బొమ్మ దహనానికి యత్నించిన నాయకులు అరెస్టు
కవాడిగూడ, ఫిబ్రవరి 1: నిజామాబాద్ సీపీ నాగరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ అరవింద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎంపీ అరవింద్ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో తెలంగాణలో తిరగనీయమని హెచ్చరించారు. మంగళవారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ మాల మహానాడు, సమతా సైనిక్ దళ్, హంస మాల ఐక్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజుపై ఎంపీ అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పార్లమెంట్ సభ్యుడివా.. వీధి రౌడీవా.. అంటూ ఎంపీ అరవింద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ పదవి నుంచి వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్‌తో మాట్లాడటం దారుణమన్నారు. పోలీసు అధికారులు లేనిది ఒక్క క్షణం కూడా బయట తీరుగలేవన్న విషయాన్ని మరిచిపోవద్దని హెచ్చరించారు. బేషరతుగా సీపీ నాగరాజుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నోరుదగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. ఈ కార్యక్రమంలో కరికె శ్రీనివాస్, రాగం శ్రీరాములు, దార సత్యం, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.