కేవలం అద్దెల రూపంలో ప్రస్తుతం ఏడాదికి రూ.1.73 కోట్లు
వేలం ద్వారా హోల్‌సేల్, కమర్షియల్ షాపుల గదుల కేటాయింపు
ఇకనుంచి సంవత్సరానికి రూ.3.07 కోట్లు
ఓల్డ్ వెజ్ మార్కెట్ షిఫ్ట్‌నకు ఎమ్మెల్యే నన్నపునేని ప్రత్యేక చొరవ
వరంగల్, జనవరి 1(నమస్తేతెలంగాణ) : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదాయాన్ని పెంచుకొనే దిశగా అడుగులు వేస్తున్నది. అద్దెల రూపంలో సాధ్యమైనంత ఎక్కువ ఇన్‌కం సమకూర్చుకోవడంపై దృష్టి సారించింది. లక్ష్మీపురం వద్ద నిర్మించిన మోడల్ కూరగాయల మార్కెట్లోని హోల్‌సేల్, కమర్షియల్ షాపుల గదులను కొద్దిరోజుల క్రితం బహిరంగ వేలం ద్వారా వ్యాపారులకు కేటాయించింది. ప్లాట్‌ఫాంలను లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నది. మార్కెట్ కమిటీకి ప్రస్తుతం అద్దెల రూపంలో ఏడాదికి దాదాపు రూ1.73 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. కొత్తగా వచ్చే ఇన్‌కం కలిపితే ఇకనుంచి అద్దెల రూపంలో సమకూరే ఆదాయం ఏడాదికి రూ.3 కోట్లు దాటనుంది.
ఆసియాలోని వ్యవసాయ మార్కెట్లలో ఎనుమాముల మార్కెట్ రెండో అతిపెద్దది. మరే వ్యవసాయ మార్కెట్లో లేని రీతిలో అన్ని రకాల పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరగడం ఈ మార్కెట్ ప్రత్యేకత. నిర్వహణలోనూ ఈ మార్కెట్ కమిటీ ముందంజలో ఉంది. పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆదాయం సేకరిస్తున్న మార్కెట్ కమిటి అద్దెల రూపంలో శాశ్వత ఆదాయం లభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. త్వరలో అద్దెల ద్వారా ఏడాదికి సుమారు రూ.3.07 కోట్ల ఆదాయం సమకూర్చుకొనే స్థాయికి చేరింది.
ప్రస్తుతం 1.73 కోట్ల ఇన్‌కం..
ఎనుమాముల మార్కెట్ కమిటీకి ప్రస్తుతం అద్దెల రూపంలో ఏడాదికి దాదాపు రూ1.73 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. ఈ మార్కెట్ కమిటీకి వివిధ ప్రదేశాల్లో 26 గోదాములు ఉన్నాయి. వీటి ద్వారా అద్దె రూపంలో ప్రతి నెలా రూ.11,41,079 చొప్పున ఏ టా రూ.1,36,92,948 ఆదాయం వస్తున్నది. ఎనుమాముల మార్కెట్లో 6 పాన్‌షాపులు, 5 క్యాంటీన్లు ఉన్నాయి. అద్దె రూపంలో పాన్‌షాపుల ద్వారా నెలనె లా రూ.99,366 అంటే ఏడాదికి రూ.11,92,387 ఆదాయం సమకూరుతున్నది. క్యాంటీన్ల ద్వారా ప్రతి నెలా రూ.72,135 చొప్పున ఏడాదికి రూ.8,65,613 ఆదాయం అద్దెల ద్వారా వస్తున్నది. ఈ మార్కెట్ కమి టీ పరిధిలోని లక్ష్మీపురం పాత కూరగాయల మార్కెట్లో 91 హోల్‌సేల్ షాపులు ఉన్నాయి. వీటిని కమీషన్ ఏజెంట్లకు అద్దెకు ఇచ్చింది. ఒక్కో దుకాణం నుం చి నెలకు రూ.750 చొప్పున 91 షాపుల ద్వారా ఏడాదికి రూ.8.55 లక్షల ఆదాయం వస్తున్నది. ఇదే పాత కూరగాయల మార్కెట్లో ప్లాట్‌ఫాంల ద్వారా అద్దెల రూపంలో ప్రతి నెలా సుమారు రూ.50 వేల చొప్పున ఏడాదికి రూ.6 లక్షల వరకు సమకూరుతున్నది.
మోడల్ కూరగాయల మార్కెట్..
లక్ష్మీపురం పాత కూరగాయల మార్కెట్ పక్కన ప్రభుత్వం రూ.6.24 కోట్ల వ్యయంతో మోడల్ కూరగాయల మార్కెట్ నిర్మించింది. ఇటీవల దీన్ని స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ మోడల్ మార్కెట్లో 82 హోల్‌సేల్ షాపుల గదులు, 158 ప్లాట్‌ఫాంలతో పాటు 30 కమర్షియల్ షాపుల సముదాయం ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న పాత కూరగాయల మార్కెట్ స్థానంలో వెజ్, నాన్‌వేజ్ మార్కెట్ ఒకేచోట ఉండేలా రూ.27 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టేందుకు పాత కూరగాయల మార్కెట్‌ను పూర్తిగా మోడల్ మార్కెట్లోకి తరలించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాత మార్కెట్లో 91 హోల్‌సేల్ షాపుల గదులు ఉంటే మోడల్ మార్కెట్లో 82 హోల్‌సేల్ షాపుల గదులు మాత్రమే ఉన్నందున తమకు సరిపోవని పాత మార్కెట్లోని కూరగాయల కమీషన్ ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని ఇటీవల పలుమార్లు పాత కూరగాయల మార్కెట్లోని కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులతో మాట్లాడారు. మోడల్ మార్కెట్లో తక్కువగా ఉన్న షాపుల గదులను త్వరలో నిర్మించి ఇస్తామని నచ్చజెప్పారు. దీంతో వ్యాపారులు అంగీకరించటంతో పాత కూరగాయల మార్కెట్‌ను మోడల్ మార్కెట్లోకి తరలించేందుకు మార్గం సుగమమైంది. వ్యాపారులకు చెప్పినట్లు ఎమ్మెల్యే కొద్దిరోజుల క్రితం కలెక్టర్ బీ గోపితో కలిసి మోడల్ మార్కెట్లో అదనంగా మరో 13 హోల్‌సేల్ షాపుల గదులు నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించారు.
కొత్తగా రూ.1.50 కోట్ల ఆదాయం..
ఎమ్మెల్యే చొరవతో పాత కూరగాయల మార్కెట్ తరలింపునకు లైన్ క్లియర్ కావడంతో మార్కెట్ కమిటీ అధికారులు మోడల్ మార్కెట్ వినియోగంపై దృష్టి పెట్టారు. మోడల్ మార్కెట్లోని 82 హోల్‌సేల్ షాపుల గదుల కేటాయింపు కోసం కొద్ది రోజుల క్రితం వేలం నిర్వహించారు. పాత కూరగాయల మార్కెట్లోని 91 హోల్‌సేల్ షాపుల కమీషన్ ఏజెంట్లకు మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం కల్పించారు. 82 గదులను ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరిలుగా నిర్ణయించగా వేలం ద్వారా కమీషన్ ఏజెంట్లు ప్రతి నెలా రూ.2,91,710 అద్దె చెల్లించే ఒప్పందంపై పొందారు. తద్వారా ఏడాదికి అద్దె రూపంలో సుమారు రూ.35 లక్షల ఆదాయం రానుంది. రెండు రోజుల క్రితం మార్కెట్ అధికారులు మోడల్ మార్కెట్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని 30 గదులకు బహిరంగ వేలం నిర్వహించారు. వ్యాపారులు పోటీపడి ఈ 30 షాపుల గదులను నెలనెలా రూ.6.25 లక్షల అద్దె చెల్లించే ఒప్పందంపై దక్కించుకున్నారు. ఈ లెక్కన ఏడాదికి షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా అద్దె రూపంలో మార్కెట్ కమిటీకి రూ.75 లక్షల ఇన్‌కం రానుంది. అలాగే ఒక్కో ప్లాట్‌ఫాం అద్దె నెలకు రూ.2,100 నిర్ణయించారు. మొత్తం 158 ప్లాట్‌ఫాంలను త్వరలో డ్రా పద్ధతిలో వ్యాపారులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి ద్వారా అద్దె రూపంలో ఏడాదికి రూ.39,81,600 ఆదాయం సమకూరనుంది. పాత కూరగాయల మార్కెట్లోని 91 హోల్‌సేల్ షాపులతో పాటు ప్లాట్‌ఫాంల ద్వారా ఇన్నాళ్లు వస్తున్న ఆదాయం పోనుండగా మోడల్ మార్కెట్ ద్వారా కొత్తగా వచ్చే అద్దె డబ్బుతో ఏడాదికి రూ.3.07 కోట్లకు చేరనుంది.
త్వరలో మార్కెట్ షిఫ్ట్…