
ధాన్యం కొంటామని డ్రామాలు
బీజేపీ నేతల తీరుపై అందోల్ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఫైర్
అందోల్, నవంబర్ 30 : రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకులది పూటకో మాట అని.. సఖ్యత లేకుండా మాట్లాడుతూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. ఒకరు వడ్లు కొంటామని, మరొకరు వడ్లు కొనం బియ్యం కొంటామని ఢిల్లీలో ఓ మాట.. గల్లీలో ఓ మాట మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. మంగళవారం అందోల్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతులపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్నారు. దేశంలోని మిగతా రాష్ర్టాల్లో ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తూ.. ఇక్క డి రైతుల ధాన్యం కొనుగోళ్ల విషయంలో మాత్రం డ్రామాలాడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారని, అయినా కూడా ఎలాంటి చలనంలేదన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం నెట్టుతూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రివర్గలో కిషన్‌రెడ్డి ఉన్నా తెలంగాణ ప్రజలకు ఎలాంటి లాభం లేకుండా పోయిందన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించని కిషన్‌రెడ్డి మంత్రిగా ఉన్నా… లేకున్నా ఒక్కటే అని మాట్లాడారని దీనిపై ఆ పార్టీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు బద్ద శత్రువులుగా ఉంటూ రాష్ట్రంలో మాత్రం కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మరోసారి అనైతిక పొత్తుకు పూనుకున్నాయన్నారు. ఎవరెన్ని ఎత్తుల వేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల రాష్ట్ర మార్కుఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఏఎంసీ చైర్మన్లు మల్లికార్జున్, రజినీకాంత్, ఎంపీపీ బాలయ్య, మాజీ ఎంపీపీ రామాగౌడ్, జడ్పీటీసీ రమేశ్, పార్టీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, నాయకులు లింగాగౌడ్, హరినారయణ వర్మ, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.