మొయినాబాద్, ఆగస్టు 6: చిలుకూరు గ్రామం అభివృద్ధి పథం లో దూసుకుపోతున్నది. మరుగుదొడ్ల నిర్మాణం వందశాతం పూర్తి చేసుకోవడంతో దేశంలోనే ఉత్తమ పంచాయతీల్లో చిలుకూరు 19వ స్థానం కైవసం చేసుకున్నది. గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామాల ముఖచిత్రాలు మార్చాలని సంకల్పించి పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో చిలుకూరు రూపురేఖలు మారాయి. పల్లె ప్రగతిలో భాగంగా ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించి, డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పకడ్బందీగా పారిశుధ్య పనులు చేపడుతున్నారు. పల్లె ప్రకృతి వనంలో వాకింగ్ ట్రాక్‌లు, పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. దారికి ఇరువైపులా పూల మొక్కలతో హరిత శోభ సంతరించుకున్నది. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పరిఢవిల్లుతున్నది.
అభివృద్ధిలో దూసుకుపోతున్న గ్రామం
మొయినాబాద్ మండలంలో చిలుకూరు మేజర్ పంచాయతీ. ఈ పంచాయతీకి దేవల వెంకటాపూర్ (చిలుకూరు బాలాజీ)తో పాటు శివానగర్ కాలనీ అనుబంధ గ్రామాలుగా ఉన్నాయి. పంచాయతీ పరిధిలో 1684 కుటుంబాలు, 12,552 జనాభా ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతిలో భాగంగా తడి, పొడి చెత్త సేకరణ, పల్లె ప్రకృతివనం, పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు సర్పంచ్ స్వరూప. గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కా ల్వల నిర్మాణం పూర్తిచేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయి. 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యాయి. గ్రామం పొలిమేర వరకు రోడ్డుకు ఇరువైపులా రెండు వరుసల్లో హరితహారం మొక్కలు పచ్చదనంతో కనువిందు చేస్తున్నా యి. వైకుంఠధామంతో పాటు ఆర్చి పనులు కొనసాగుతున్నాయి.
అభివృద్ధి పనులు
గ్రామంలో రూ.18.49 లక్షలతో సీసీ రోడ్లు, రూ.24.10 లక్షలతో అంతర్గత మురుగు కాల్వల నిర్మాణం, రూ.1.42 లక్షలతో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిధులతో ఆరోగ్య ఉప కేంద్రాన్ని నిర్మించారు. దాతల సహాయంతో రూ.కోటి నిధులతో ప్రభుత్వ పాఠశాల నిర్మించారు.
పక్కాగా పారిశుధ్య నిర్వహణ
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి రోజూ పంచాయతీ సిబ్బందితో వీధులు శుభ్రం చేయిస్తున్నారు. రూ.6 లక్షలతో ట్రాక్టర్ కొనుగోలు చేశారు. ట్రాక్టర్‌తో పాటు 3 ట్రాలీ ఆటోలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను పంచాయతీ ట్రాక్టర్‌తో తరలిస్తున్నారు. సేకరించిన చెత్తను వేయడానికి రూ.2 లక్షలతో డంపింగ్ యార్డు నిర్మించారు. సేంద్రియ ఎరువు తయారు చేయడానికి రూ.10 లక్షలతో కంపోస్టు షెడ్డు నిర్మించారు.
పల్లె ప్రకృతి వనంపై ప్రత్యేక దృష్టి
పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం అడవిని తలపిస్తున్నది. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 632లో రూ.3 కోట్ల విలువ గల ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల 4000 మొక్కలు నాటారు. టేకు, చింత, జామ, నీలగిరి, ఎర్రతంగడి, దానిమ్మ, ఉసిరి, చైనాబాదాం, గుల్మోహర్, మందారం, రాగి, కానుగ మొక్కలు నాటారు. రూ.3.35 లక్షలు ఖర్చు చేసి వాటిని సంరక్షిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా నాటిన 3740 మొక్కల సంరక్షణకు రూ.6.90 లక్షలు ఖర్చు చేశారు.
ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా..
గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా అభివృద్ధి చేస్తాం. పల్లె ప్రగతిని సద్వినియోగం చేసుకుంటూ గ్రామంలోని ప్రధాన సమస్యలు పరిష్కరించుకుంటున్నాం. గ్రామంలో పారిశుధ్యంతోపాటు పచ్చదనాన్ని పెంచుతున్నాం. సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాల్వల నిర్మాణం చేపడుతున్నాం. దాతల సాయంతో రూ.కోటితో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మించాం. పాలకవర్గ సభ్యులతో పాటు ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం.