
కాదేది కళకు అనర్హం అన్న చందంగా సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏదీలేదు అని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. చాక్‌పీస్ (సుద్దముక్క) చేతికి దొరికితే.. చాలు ఒక ఆకారాన్ని చెక్కి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. సుద్దముక్కలో కళారూపాలు సృష్టించి, అందరి మన్ననలు పొందుతున్నాడు కులకచర్ల మండలం ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన రాఘవేందర్‌గౌడ్. చాక్పీపెస్ను బొమ్మలుగా చెక్కుతూ, అద్భుతాలు సృష్టిస్తున్నాడు.
కులకచర్ల, ఆగస్టు 6: వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలంలోని ఇప్పాయిపల్లి రాఘవేందర్‌గౌడ్ సొంత గ్రామం. ఆయన తండ్రి ముసలయ్య గీత కార్మికుడు, తల్లి పోషమ్మ. ఆయన చిన్న వయస్సులోనే వివిధ రకాల చిత్రాలకు ఆకర్షితుడయ్యేవాడు. వాటిని గమనిస్తూ అలాగే తాను చూసిన చిత్రాలను చాక్‌పీస్ ముక్కతో ఎందుకు తయారు చేయకూడదని ప్రశ్నించుకునేవాడు. చిన్నచిన్న చాక్‌పీస్ ముక్కలు తీసుకుని మొదటగా అర అంగుళం ఉన్న చిన్న చిత్రాలు తయారు చేశాడు. చాక్‌పీస్ ముక్కపై మదర్‌థెరిస్సా, జాతీయ నాయకులు, సైంటిస్ట్‌ల బొమ్మలు తయారుచేశాడు. ఆకులు, పెన్సిల్, కాగితాలపై బొమ్మలు వేస్తూ తనదైన ప్రతిభ కనబరున్నాడు. వినాయక ప్రతిమలు తయారు చేసి, వాటికి రంగులు అద్ది చూపరులను ఆకట్టుకునేవాడు. చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. పేపర్‌పై బొమ్మలు వేయడం కాకుండా భిన్నంగా ఆలోచించాడు. అతడి అన్న రాజుగౌడ్ ఆర్టిస్ట్ కావడంతో మరింత ప్రోత్సాహం లభించింది.
మైక్రో ఆర్టిస్ట్‌గా..
ఆకులు, చాక్‌పీసులు, గోడలపై, పెన్సిల్ ముక్కుతో, చెక్కపై రకరకాల బొమ్మలు తయారుచేసేవాడు. సొంతంగానే చిత్రలేఖనం చేసేవాడు. ఫొటోగ్రఫీపై అమితాసక్తి. దీంతో ఒక ఆఫీసులో వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా ఉద్యోగం చేస్తూ పీజీ పూర్తిచేశాడు. మైక్రో ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్న రామ్ కొన్ని షార్ట్ఫిలిమ్స్కు కూడా పనిచేశాడు. ఒక డైరెక్టర్ వద్ద ఇక్కడి చెట్ల గాలి, దర్జీ హ్యాలడ్స్ అనే రెండు షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. సినీ నటుడు రజినీకాంత్‌కు ఆయన వీరాభిమాని.
ఉస్మానియా యూనివర్సిటీలో ప్రథమ బహుమతి
సుద్దముక్క, కాగితాలు, పెన్సిళ్లపై వివిధ చిత్రాలు గీస్తున్న రామ్ ఉస్మానియా యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించాడు. రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీల్లో ద్వితీయ స్థానం సాధించాడు. 5నిమిషాల్లో ఫొటోగ్రఫీలో షార్ట్ ఫిలిం షూట్ చేసి తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని 4వేల మందిలో బెస్ట్ కెమెరామెన్‌గా అవార్డు తీసుకున్నాడు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్న రాఘవేందర్‌గౌడ్‌ను పలువురు అభినందిస్తున్నారు.
మనకంటూ ప్రత్యేకత ఉండాలి
చాక్‌పీస్ ముక్కలతో బొమ్మలు తయారు చేయడం నా హాబీ. ఒకటిన్నర అంగుళం ఉన్న చాక్‌పీస్ ముక్కతో బొమ్మలు తయారు చేశాను. అంతకంటే తక్కువతో బొమ్మలు తయారు చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఏదైనా ప్రత్యేకంగా కనిపించాలన్నదే నా ఆశయం. సినిమా డైరెక్టర్ కావాలని, ఫొటోగ్రఫీ చేయాలని కోరిక.