
మెదక్, ఆగస్టు 6 : అధికారులు సమన్వయంతో పనిచేస్తూ స్వాతంత్య్ర దినోత్సవాలను జయప్రదం చేయాలని మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌లో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉన్నాయని, అంతకంటే ముందుగా ఏర్పాట్లపై అధికారులందరు సిద్ధంగా ఉండాలని అన్నారు. కరోనా నేపథ్యంలో ఈ సారి కూడా కలెక్టరేట్ ఆవరణలో వేడుకలు నిర్వహించనున్నామని అందుకనుగుణంగా డయాస్, బారీకేడింగ్ ఏర్పాటుతోపాటు కలెక్టరేట్ లోపల, వెలుపలికి వెళ్లేదారిని లెవలింగ్ చేయాల్సిందిగా ఆర్అండ్బీ ఈఈ శ్యాంసుందర్‌కు సూచించారు. అతిథికి పోలీసు గౌరవ వందనం, వేడుకలలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చూడాల్సిందిగా డీఎస్పీ కృష్ణమూర్తికి సూచించారు. ఆ రోజు పట్టణమంతా శుభ్రంగా ఉండేలా చూడాలని, మైదానంలో వాటరింగ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరికి సూచించారు. డయాస్‌ను అందంగా అలంకరించాలని ఉద్యానశాఖ సహాయ సంచాలకుడు నర్సయ్యకు, విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ ఎస్ఈ జానకీరాంకు సూచించారు. ముఖ్యఅతిథికి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రసంగం రూపొందించాల్సిందిగా ముఖ్య ప్రణాళికా అధికారిని, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయాల్సిందిగా డీపీఆర్వోకు సూచించారు. ప్రోటోకాల్ ప్రకారం అతిథులను ఆహ్వానించాలని, ఇన్విటేషన్ కార్డు రూపొందించాలని, మొత్తంగా అన్నిశాఖల అధికారులు వేడుకలను విజయవంతంగా నిర్వహించేలా పర్యవేక్షించాల్సిందిగా ఆర్డీవో సాయిరాం, ఏడీ మైన్స్ జయరాజ్‌కు కలెక్టర్ సూచించారు. స్టాల్స్ ఏర్పాటు చేయాల్సి వస్తే అందుకు వ్యవసాయ, ఉద్యాన, డీఆర్డీవో, జిల్లా శిశు సంక్షేమాధికారి, వైద్య ఆరోగ్య, పశు సంవర్ధకశాఖ, మత్య్సశాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులచే దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు ఐదుకు మించకుండా చేసి సిద్ధంగా ఉంచుకోవాల్సిందిగా డీఈవో రమేశ్‌కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డికు సూచించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ఇవ్వటానికి అన్నిశాఖల అధికారుల నుంచి వివరాలు తెప్పించుకొని సిద్ధంగా ఉండాల్సిందిగా కలెక్టరేట్ ఏవో యూనుస్‌కు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రతి చిన్నారికీ పీసీవీ టీకా ఇప్పించాలి..
న్యుమోనియా రాకుండా ఆరు వారాలు దాటిన ప్రతి చిన్నారికి పీసీవీ టీకా ఇప్పించాలని మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్ ప్రజలకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్లో వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీవీసీ టీకాలు ఇవ్వనున్నామని అన్నారు. పుట్టిన ప్రతి చిన్నారి ఆరోగ్యవంతంగా ఎదగాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఆరు రకాల టీకాలు ఇస్తున్నామని, ఇది ఏదోది అని అన్నారు. జిల్లాలో ఆరు వారాల పైబడిన వారు 8,394 మంది ఉన్నారని, వీరికి టీకా ఇచ్చేలా పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. టీకాలు తీసుకోకుండా మిగిలిపోయిన వారిని గుర్తించి అందరికీ ఇప్పించేలా చూడాలని వైద్య అనుబంధ శాఖల అధికారులు, సీడీపీవోలకు సూచించారు. మూడో విడత జ్వర సర్వే చేపట్టి కరోనా లక్షణాలున్న వారికి వైద్య కిట్లు అందించాల్సిందిగా జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి సూచించారు. ఇటీవల తూప్రాన్‌లో 15 వార్డుల్లో ముగ్గురికి డెంగీ వచ్చిందని, పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. అనంతరం ఏఎన్ఎంలకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ పి.చంద్రశేఖర్, జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్‌కుమార్, డీఈవో రమేశ్‌కుమార్, అదనపు డీఎంఅండ్‌హెచ్‌వోలు సుమిత్ర, మాధురి, నవీన్‌కుమార్, విజయనిర్మల, అరుణ, చంద్రశేఖర్, మాస్ మీడియా అధికారి పాండురంగాచారి, మలేరియా అధికారి పాల్గొన్నారు.