తలకొండపల్లి, ఆగస్టు 7 : రైతుల ఆత్మగౌరవం, అభ్యుదయం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతినిత్యం ఆలోచిస్తూ రైతులను రాజు చేసేందుకు ముందుకు సాగుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం తలకొండపల్లి మండలంలో ఎంపీ రాములు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి రాంపూర్, మెదక్‌పల్లి, జంగారెడ్డిపల్లి గ్రామాల్లో రైతు వేదికలు, అంగన్వాడీ కేంద్రం, వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలను ప్రారంభించారు. తలకొండపల్లి మండలానికి వచ్చిన మంత్రికి టీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సమూలమైన మార్పులు మనం చూస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు గ్రామాలు ఎలా ఉన్నాయి.. రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామాలు ఎలా ఉన్నాయనేదాన్ని ప్రజలు గమనించాలన్నారు. సర్పంచ్‌లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, రైతు వేదికల పనులను పూర్తి చేస్తూ తమ గ్రామాల్లో ఇవన్ని ఉన్నాయని సగౌరవంగా చెప్పుకుంటున్నారని అన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా తదితర పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రైతు వేదికలు లేవని.. ఆరు నెలల్లో 2,604 రైతు వేదికలు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేయాలని ఇతర రాష్ట్రాల వారు చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి పథకంతోపాటు ముఖ్యమంత్రి దళిత సోదరులకు దళిత బందు పథకం ప్రారంభించి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారని.. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఎస్సీ కాలనీలు, ఎస్టీ తండాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రైతు వేదికల ద్వారా వ్యవసాయంలో మెళకువలు, నూతన ఆవిష్కరణలపై డిజిటల్ క్లాసులు ఉంటాయని తెలిపారు. రైతుల ఆశలు, ఆకాంక్షలు, ఇబ్బందులు తెలిపే వేదిక లేదని.. అందుకే రైతు వేదికలు నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుందన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతాంగాన్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చే ఉద్దేశమే రైతు వేదికలని తెలిపారు. వ్యవసాయం మన జీవన సంస్కృతి అని.. వ్యవసాయంపై 60 శాతం జనాభా ఆధారపడి ఉందన్నారు. రైతాంగం ఆత్మ నినాదంతో వ్యవసాయం చేయాలన్నదే సీఎం కేసీఆర్ గారి ఆలోచన అని పేర్కొన్నారు. వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, పంటల సాగు, దిగుబడికి అనుసరించాల్సినటువంటి సమగ్ర సమాచారం రైతు వేదికల ద్వారా తెలియజేస్తామని తెలిపారు. రైతు వేదికల భవనాలు భవిష్యత్తులో వ్యవసాయ విప్లవానికి నాంది అవుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తొలి ప్రాధాన్యత వ్యవసాయానికేనని.. ఆ తరువాతే మిగతా రంగాలకని స్పష్టం చేశారు. వీలయినంత త్వరగా పాలమూరు-రంగారెడ్డి ద్వారా నీళ్లు ఇవ్వాలన్న ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలిపారు. ప్రాజెక్టులు పూర్తయితే రైతాంగం మొగులు వైపు చూడాల్సిన పరిస్థితి ఉండదన్నారు. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తిపై రాజధాని సమీప రైతులు దృష్టి పెట్టాలని సూచించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటేశ్, ఎంపీపీ నిర్మల, సర్పంచ్‌లు ధరణి, వరలక్ష్మి, శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు దశరథ్‌నాయక్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు రహమాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ వరలక్ష్మి, మాజీ జడ్పీటీసీ నర్సింహ, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, ఎంపీటీసీలు సుధాకర్‌రెడ్డి, వందన, ఆయా శాఖల అధికారులు, నాయకులున్నారు.