
పుస్తకాలు మోయాల్సిన వయస్సులో బండరాళ్లు, ఇటుకలు మోస్తున్నారు.. బాగా చదువుకొని భావి పౌరులుగా ఎదుగాల్సినవారు బాలకార్మికులుగా బందీ అవుతున్నారు.. అలాంటి చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది ‘ముస్కాన్’. ప్రతి ఏడాది అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివిధ ప్రదేశాల్లో పని చేస్తున్న బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది జూలై 1 నుంచి 31 వరకు ‘ముస్కాన్-7’ నిర్వహించారు. ఐదుశాఖలకు సంబంధించిన అధికారులు వివిధ దుకాణాలు, ఇటుక బట్టీలు, కంపెనీలు, తదితర పని ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో మొత్తం 232 మంది బాల కార్మికులను గుర్తించి వారికి పని నుంచి విముక్తి కల్పించారు. అందులో 204 మంది బాలురు, 28 మంది బాలికలు ఉన్నారు. అలాగే 61 మంది బాధ్యులపై కేసులు నమోదు చేశారు.
వికారాబాద్, ఆగస్టు 6, (నమస్తే తెలంగాణ): ఇంట్లో చిరునవ్వులు చిందించాల్సిన కొందరు చిన్నారులు నిర్బంధ శ్రమతో మగ్గిపోతున్నారు. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక వెనుకబాటు, నిరక్షరాస్యత ఇలా పలు రకాల కారణాలతో బాల కార్మికులుగా మారుతున్నారు. అలాంటి వారిని ‘ముస్కాన్-7’ కింద వికారాబాద్ జిల్లాలో 28 మంది బాలికలు, 204 మంది బాలురులను అధికారులు గుర్తించి వారికి విముక్తి కల్పించారు. పరిగి 16, తాండూరు 40, వికారాబాద్ 5 చొప్పున పోలీసులు కేసులు నమోదు చేశారు. వీళ్లంతా ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహబూబ్‌నగర్, ఒడిశా, ఉత్తరాఖండ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.
ఐదు శాఖల ఆధ్వర్యంలో..
ప్రతి ఏటా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరిట బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా పోలీసులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, చైల్డ్‌లైన్, రెవెన్యూ శాఖలతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. తాజాగా గత నెల 1 నుంచి 31వ తేదీ వరకు ముస్కాన్-7 కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కిరాణా, మెకానిక్‌లుగా, పంట చేలల్లో కూలీలుగా, బర్రెలు, గొర్రెల కాపరులుగా, వివిధ పరిశ్రమలు, కంపెనీలు, భవన నిర్మాణ రంగాల్లో, ఇటుక బట్టీలపై అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం 232 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. వారిని హాస్టళ్లు, పాఠశాలలు, కేజీబీవీల్లో చేర్పించనున్నారు. పనుల్లో పెట్టుకున్న యజమానులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వీధుల్లో చెత్త ఏరుకోవడం, రోడ్ల వెంట భిక్షాటన చేస్తున్న చిన్నారులను గుర్తించి బాల సదనానికి తరలించారు. 61 మంది బాధ్యులపై కేసులు నమోదు చేశారు.
ఆర్థిక, సామాజిక పరిస్థితులే సమస్య..
జిల్లాలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండడంతో తమ పిల్లలను బడులకు పంపించకుండా బాల కార్మికులుగా మార్చేస్తున్నారు. దీనికి ఆర్థిక, సామాజిక పరిస్థితులే కారణమని తెలుస్తున్నది. జిల్లాలో లక్షల ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. సాగునీటి సౌలభ్యం పెరుగుతూ వస్తోంది. ఫలితంగా కూలీల కొరత ఏర్పడింది. రోజుకు రూ.500 ఇచ్చినా కూలీలు దొరకని పరిస్థితి ఉంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పొలాలకు తీసుకెళ్తున్నారు. వారిలో మార్పు వస్తేనే బాలకార్మిక వ్యవస్థ రూపమాపవచ్చని అధికారులు, మేధావులు పేర్కొంటున్నారు.
మూడేండ్లలో 500లకు పైగా..
2019 జనవరిలో ఆపరేషన్ స్మైల్, ముస్కాన్‌ల ద్వారా 160, 2020లో 88, ఈ ఏడాది 232 చొప్పున మొత్తం 580 మంది బాలబాలికలకు విముక్తి కల్పించారు. జిల్లాలోని తాం డూరు, వికారాబాద్, పరిగి ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నారు. కొడంగల్‌లో అత్పల్పంగా ఉన్నారు. ప్రతి ఏటా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరిట బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు చేపడుతున్నారు.
బాలలను పనిలో పెట్టుకోవద్దు
18 ఏండ్లలోపు బాల, బాలికలను పనిలో పెట్టుకుంటే పట్టుకుంటాం. బాధ్యులకు జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది. అధికంగా వ్యవసాయ సంబంధిత, కిరాణా, మెడికల్, మెకానిక్ దుకాణాల్లో పనులు చేస్తున్న వారిని గుర్తించాం. జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్-7 పూర్తి చేశాం. వివిధ శాఖల సమన్వయంతో దాడులు చేశాం. ఇప్పటికే 232 మంది బాల కార్మికులు, భిక్షాటన, వ్యవసాయ పనులు, మెకానిక్ షెడ్లలో పనిచేసే బాల, బాలికలను గుర్తించాం. జిల్లాలోని పరిగిలో 16, తాండూరులో 40, వికారాబాద్ 5 చొప్పున కేసులు నమోదయ్యాయి.