
పెనుబల్లి, జనవరి 3: రైతుబంధు రైతుల ఇంట సంబురం తెచ్చింది. సాగుకు అందిన పెట్టుబడి సాయంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెనుబల్లి మండలంలోని కుప్పెనకుంట్లకు చెందిన రైతులు సోమవారం గ్రామంలో వేడుకలు నిర్వహించారు. మహిళలు ఇంటిముందు ‘జై కేసీఆర్’,‘జయహో రైతుబంధు’ రంగవల్లులు వేశారు. వీటిని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబాంధవుడు సీఎం కేసీఆర్ అన్నారు. రైతుబంధు ద్వారా నాలుగేళ్లలో రైతులకు రూ.50వేల కోట్ల సాయాన్ని అందించారన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా భావించి సీఎం కేసీఆర్ అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. కేంద్రం లోని బీజేపీ మాత్రం రైతుల నోట్లో మట్టి కొడుతుందన్నారు. నల్ల వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ ప్రాంతంలో ఉద్యమం చేస్తుంటే వాహనాలతో తొక్కించి రైతుల ప్రాణాలను బలగొన్నదన్నారు. రైతులకు అండగా ఉండేది ఒక్క టీఆర్ఎస్సేనన్నారు. ఉద్యమ సమయంలో ప్రజల సమస్యలను తెలుసుకున్న ఉద్యమ నేత కేసీఆర్, ముఖ్యమంత్రి అయ్యాక వాటన్నింటినీ పరిష్కరించారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు, కార్యదర్శి భూక్యా ప్రసాద్, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, ఏఎంసీ ఛైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మందడపు అశోక్‌కుమార్, నాయకులు వెంకటేశ్వరరావు, మారేశ్వరరావు, వీరభద్రారెడ్డి, భూపాల్ రెడ్డి, శేఖర్‌రావు, వెంకటరెడ్డి, నరోత్తమరెడ్డి, రవికుమార్, నాగదాసు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎరువులు, విత్తనాలు కొంటున్నా..
గతంలో సాగుకు ఇబ్బంది పడేటోళ్లం. ఉమ్మడి పాలనలో రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. నాలుగేండ్ల నుంచి నాకు రైతుబంధు సాయం అందుతున్నది. అప్పటి నుంచి సాగుకు ఎవరి దగ్గరా చేయి చాచడం లేదు. సర్కారు ఇచ్చే సొమ్ముతో విత్తనాలు, ఎరువులు కొంటున్నా. ఇంత మంచి పథకం ఇప్పటివరకు ఏ ప్రభుత్వంలోనూ నేను చూడలేదు. ఏడాదికి ఒక్కో ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నారంటే మామూలు విషయం కాదు. సీఎం కేసీఆర్ సల్లగుండాలె.
-పిన్నెల్లి యాదగిరి, రైతు, రామకృష్ణాపురం, చింతకాని మండలం