
ఉత్పత్తులను అమ్మడానికి కలెక్టరేట్లో స్టాల్ ఏర్పాటు : సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు
సంగారెడ్డి, ఆగస్టు 7: ప్రభుత్వం నేతన్నలకు అన్నివిధాలా చేయూత నిస్తున్నదని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అన్నా రు. శనివారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఐటీఐ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి కలెక్టర్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో చేనేత సహకారశాఖ అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జోగిపేట, నారాయణఖేడ్, హనుమంతరావుపేట చేనేత సహకార సం ఘాల కార్మికులను కలెక్టర్ సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ చేనేత రంగాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కార్మికులకు అందజేసిన మగ్గాలకు జియో ట్యా గింగ్ చేసిందన్నారు. జిల్లాలోని చేనేత సహకార సంఘాలు తమ ఉత్పత్తులను అమ్ముకునే విధంగా కలెక్టరేట్లో ప్రతి సోమవారం స్టాల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
చేనేత కార్మికులు, రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తున్నదని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. నేతన్నకు చేతినిండా పని కల్పించేందుకు మార్కెటింగ్ వరకు అవసరమైన సదుపాయాలు సమకూరుస్తుందన్నారు. నేతన్నకు చేయూతనిచ్చేలా ప్రజలు చేనేత వస్ర్తాలు ధరించాలని ఎమ్మెల్యే కోరారు. జిల్లాలో పనిచేస్తున్న 74 మంది చేనేత కార్మికులు, 31 మంది అనుబంధ కార్మికులు వివిధ చేనేత సహకార సంఘల్లో పనిచేయడం సంతోషకరమన్నారు.
దేశవ్యాప్తంగా చేనేత పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. మగ్గంపై నేసే వస్ర్తాలను ప్రజలు ధరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, చేనేత సహకార సం ఘాల అధ్యక్షులు, ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.
సదాశివపేట, ఆగస్టు 7: చేనేతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం చేనేత దినోత్సవం సందర్భంగా సదాశివపేట పట్టణంలోని చేనేత సహకార సంఘంలో అధ్యక్షుడు చింతా గోపాల్ అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ చేనేతల సంక్షే మానికి ప్రభుత్వం వరంగల్, సిరిసిల్లలో చేనేత క్లస్టర్‌కు భారీ మొత్తంలో బడ్జెట్లో నిధులు కేటాయించారన్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేనేతలకు సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చింతాగోపాల్, పద్మశాలీ సంఘం పట్టణ అధ్యక్షుడు అంబటి విశ్వనాథం, ఈశ్వర మార్కండేయ సంఘం అధ్యక్షుడు చిల్వెరి రవి, మున్సిపల్ కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం, సంఘం కార్యవర్గ సభ్యులు గడీల గణేశం, పోల ప్రభుకుమార్, చిల్వెరి వెంకటేశం, గోనె శంకర్, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి పాల్గొన్నారు.