
ఉమ్మడి రాష్ట్రంలో చతికిలబడ్డ చేనేత పరిశ్రమకు ప్రభుత్వం జవసత్వాలు తెస్తున్నది. బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను బడ్జెట్లో ‘నేతన్నకు చేయూత’ పథకానికి రూ.338కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో మరో రూ.30కోట్లను ఈ నెల 3న రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో నేతన్నలు ఆనందం వ్యక్తచేస్తున్నారు. 2010 నుంచి కార్మికులు తీసుకున్న వ్యక్తిగత రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రభుత్వం నాలుగేండ్లుగా తెలంగాణలో చేనేత వస్ర్తాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది. చేనేత వస్ర్తాలు, పరిశ్రమల గురించి అవగాహన కల్పిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పనిసరిగా చేనేత వస్ర్తాలనే ధరించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చేనేత వస్ర్తాలకు గిరాకీ పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత వస్త్ర దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో చేనేత సహకార సంఘాలు చురుగ్గా పని చేస్తున్నాయి. విశ్వఖ్యాతిని తెచ్చిన గొల్లభామ చీరెల తయారీలో కార్మికులకు గుర్తింపు లభిస్తుంది.
జిల్లాలో పన్నెండు చేనేత సొసైటీలు..
జిల్లాలో పన్నెండు చేనేత సహకార సంఘాలు పని చేస్తున్నాయి. సిద్దిపేట చేనేత సహకార సంఘం, ఆదర్శ చేనేత సహకార సంఘం, ఇర్కోడు చేనేత సహకార సంఘం, ప్రాజెక్టు చేనేత సహకార సంఘం, తిరుమల చేనేత సహకార సంఘం, దుబ్బాక చేనేత సహకార సంఘం, హుస్నాబాద్‌లోని శ్రీరాములుపల్లి చేనేత సహకార సంఘం, పొట్లపల్లి చేనేత సహకార సంఘం, వీరారెడ్డిపల్లి చేనేత సహకార సంఘం, మిరుదొడ్డి మండలం ధర్మారం ఉన్ని సహకార సంఘం, గజ్వేల్ చేనేత సహకార సంఘం, దుద్దెడ చేనేత సహకార సంఘాలు ఉండగా.. ఇందులో జియో ట్యాగ్ ద్వారా 535 మగ్గాలకు గుర్తింపు నివ్వడంతో 880 మంది చేనేత కార్మికులు పని చేస్తున్నారు. వీరే కాకుండా మాస్టర్ వీవర్స్ వద్ద చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పనిలో నిమగ్నమై ఉన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం అందించే కొండా లక్ష్మణ్‌బాపూజీ గొల్లభామ చీరల తయారీలో మూడు సార్లు అవార్డులు సిద్దిపేట చేనేత సహకార సంఘానికి దక్కినట్లు ఏడీ వెంకటరమణ తెలిపారు. ఈ ఏడు అవార్డుల కోసం నలుగురిని ప్రతిపాదించామని, వారిలో మొదటి సారిగా పీతాంబరం చీరెను నేసిన కార్మికుడు ఉన్నాడన్నారు.
దుబ్బాక చేనేతలో సరికొత్త డిజైన్లు..
చేనేత వస్ర్తాల తయారీలో దుబ్బాకకు ప్రత్యేక స్థానం ఉన్నది. 1949లో ఏర్పడిన దుబ్బాక చేనేత సహకార సంఘం చీరెల తయారీలో పెట్టింది పేరు. ముఖ్యంగా గొల్లభామ చీరెలు, కాటన్ చీరెలు నేయడంలో ఇక్కడి కార్మికులు నిష్ణాతులు. 40 గ్రామాలకు చెందిన 3600ల మంది చేనేత కార్మికులతో కొనసాగిన సంఘం ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలకు వేదికైంది. నేడు సంఘంలో 1780 మంది కార్మికులు సభ్యులుగా ఉన్నారు. అప్పటి తరహాలోనే నేడు సంఘంలో కాలానికి అనుగుణంగా కార్మికులు మార్పు చెందాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. అధునాతన డిజైన్లతో లుంగీలు, తువ్వాలలు, బెడ్షీట్లు తయారు చేస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ పలువురి మన్నలను పొందుతున్న కార్మికులు విన్నూత ప్రయోగాల కోసం తమ నైపుణ్యానికి పదును పెడుతున్నారు. మరో అడుగు ముందుకేసి మగవారి లెనిన్ షూటింగ్, షర్టింగ్ అందించిన తరహాలోనే స్త్రీలకు లెనిన్ కాటన్ చీరెల తయారీకి శ్రీకారం చుట్టారు. 50 మగ్గాలపై 62 మంది కార్మికులు నేడు మరమగ్గాలకు తీసిపోని విధంగా నేటి తరానికి అనుగుణంగా సరికొత్త డిజైన్ల వస్త్ర తయారీపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ‘నేతన్నకు చేయూత’ పథకంలో చేరి పొదుపు చేసుకుంటున్నారు.
చేనేతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ..
దుబ్బాక చేనేతకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. సీఎం కేసీఆర్ దుబ్బాక చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తామని వృత్తిపై ఆధారపడిన నేతన్నల బతుకులు బంగారం చేస్తామని దుబ్బాక సభలో ప్రకటించి వెంటనే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. దుబ్బాక చేనేత కార్మికుల స్థితిగతులపై అవగాహన కోసం తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సినీనటి సమంత రెండు పర్యాయాలు దుబ్బాక సొసైటీని సందర్శించి కార్మికులు తయారు చేస్తున్న వస్ర్తాలు ఇక్కడి పరిస్థితిని అధ్యయనం చేశారు. స్వయంగా చేనేత జౌళీశాఖ మంత్రి కేటీఆర్ సొసైటీని సందర్శించి కార్మికులతో చర్చించి భవిష్యత్ బాగుకోసం అనేక పథకాలకు రూపకల్పన చేశారు. స్వయంగా దుబ్బాక చేనేతకు వర్కింగ్ క్యాపిటల్ కింద రూ.కోటి మంజూరు, వ్యక్తిగత రుణమాఫీని పూర్తి స్థాయిలో మాఫీ చేయించారు. మంత్రి హరీశ్‌రావు సైతం చాలా సార్లు సొసైటీని సందర్శించి కార్మికులు తయారుచేస్తున్న వస్ర్తాలను పరిశీలించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఒక్కోరంగాన్ని బలోపేతం చేస్తున్నది. సాగు నీటి ప్రాజెక్టులు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయ రంగాన్ని పండుగలా చేసింది. వృత్తి కులాల వారి అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక వినూత్న పథకాలను ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ గ్రామాల్లో వెలుగులు నింపారు. వ్యవసాయ రంగం తరువాత రెండో అతి పెద్ద ఉపాధి రంగంగా ఉన్న చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు కొత్త పథకాలతో కార్మికులకు బతుకు భరోసా కల్పిస్తోంది. చేనేత కార్మికులకు ‘నేతన్నకు చేయూత’ పథకం, చేనేత మిత్ర (త్రిఫ్ట్‌ఫండ్), నూలుపై సబ్సిడీ, రుణాలు వంటి పథకాలతో పరిశ్రమను ప్రగతి బాటలో నడిపించేందుకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి
కేటీఆర్ కొన్నేండ్లుగా తనదైన శైలిలో ప్రత్యేక శ్రద్ధచూపుతున్నారు.