మణికొండ, డిసెంబర్ 10 : చెత్తే కదా అంటే ఇక చెల్లదు.. చెత్తకు ఉందో లెక్క తడిపొడి చెత్తను వేరు చేస్తే అద్భుత ఫలితాలను సాధించవచ్చనడానికి ఇదో చక్కటి నిదర్శనం. కొన్నాళ్లుగా తెలంగాణ సర్కారు స్వచ్ఛ సర్వేక్షణ్ పేరిట ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నార్సింగి మున్సిపాలిటీలో అధికారులు డ్రై రిసోర్స్ సెంటర్(డీఆర్సీ) కేంద్రాలతో తడి చెత్తతో అధునాతన పద్ధతులను అవలంబిస్తూ సేంద్రియ ఎరువును తయారు చేసి మార్కెట్లో ఉచితంగా పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేటు సూపర్మార్కెట్లో సేంద్రియ ఎరువులను కేజీ డబ్బాల్లో నింపి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అదనంగా కావాల్సిన వారికి కేజీ రూ.2 చొప్పున విక్రయించేందుకు సిద్ధంగా ఉంచారు. గతంలో జీహెచ్ఎంసీలో అధికారులు పైలట్ ప్రాజెక్టుగా ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రజలను ఆకట్టుకోలేకపోయారు. కానీ నార్సింగి మున్సిపాలిటీ అధికారులు మరో అడుగు ముందుకేసి ఆకట్టుకునే ప్లాస్టిక్ డబ్బాల్లో సేంద్రియ ఎరువును నింపి విక్రయాలు మొదలు పెట్టారు. ఇందుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది.
ప్రజల్లో అవగాహన ఇలా..
స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో భాగంగా సేకరించిన చెత్తను వేరు చేస్తున్నారు. గ్రీన్ డబ్బాలో తడి, బ్లూ డబ్బాలో పొడి, రెడ్ డబ్బాలో ప్రమాదకరమైన నాప్కిన్స్ ప్లాస్టిక్ చెత్తను సేకరిస్తున్నారు. ప్రతి రోజు చెత్త సేకరణపై ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ చేపడుతున్నారు. తడిచెత్త (కూరగాయలు, కడిగేసిన ఆకుకూరలు, పాడైన తినేవస్తువులు, కుళ్లిన కూరలు) వంటి వాటితో మూడు రోజుల్లో ఎరువు తయారు చేస్తున్నారు. పొడి చెత్త(అట్టముక్కలు, గాజులు, సీసాలు, పేపర్లు) వంటి వాటితో మూడు రోజుల్లో ఎరువును తయారు చేస్తున్నారు. రెడ్ డబ్బాలో ఉన్నదానిని తిరస్కరించిన చెత్తగా పరిగణించి కాల్చివేస్తున్నారు.
మూడు డీఆర్సీ కేంద్రాల్లో ఎరువుల తయారీ
మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్, వట్టినాగులపల్లి, గండిపేటల్లోని డీఆర్ఎసీ కేంద్రాలతో ఎరువులను తయారు చేస్తున్నారు. ప్రతి రోజు మున్సిపాలిటీ నుంచి 45 ఆటోలు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించడంతో పాటు సాయంత్ర వేళల్లో కమర్షియల్ వ్యాపార కేంద్రాల వద్ద చెత్తను సేకరించి డీఆర్సీ కేంద్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అద్భుత ఫలితాలొస్తున్నాయి..
తడి, పొడి చెత్త ఇచ్చేటప్పుడు ప్రజలు పూర్తి అవగాహనతో అందిస్తున్నారు. దీంతో డీఆర్సీ కేంద్రాల వద్ద సేంద్రియ ఎరువు తయారీ చేస్తున్నారు. ఫాం హౌసుల్లో ఎరువులను వాడేందుకు బుకింగ్ చేసుకుంటున్నారు. గేటెడ్, విల్లా కమ్యూనిటీలకు కేజీ డబ్బాలను మొదటిసారిగా ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. అద్భుత ఫలితాలు వస్తుండడం సంతోషంగా ఉన్నది.