
నిలకడలేని వైఖరి, ప్రకటనలతో కార్యకర్తలకు అన్యాయంఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తీరుపై చండూరు కౌన్సిలర్ నిర్వేదందళిత నేతలను ఎదుగనివ్వడం లేదంటూ ఆవేదన కోమటిరెడ్డి తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
చండూరు, ఆగస్టు 6 : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, చండూరు మున్సిపల్ కౌన్సిలర్ అన్నెపర్తి శేఖర్ శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ‘పదవుల కోసం గంటకో మాట.. గడియకో పార్టీ పేరు చెప్తూ
కార్యకర్తలకు తీరని అన్యాయం చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీరుకు నిరసనగానే కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు’ మీడియా సమావేశంలో ప్రకటించారు. మాయ మాటలతో గెలిచి నియోజకవర్గ అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోని రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెప్పేందుకు సొంత పార్టీ నాయకులే సిద్ధంగా ఉన్నారన్నారు.
‘నియోజకవర్గంలో ఒక్క దళితుడినీ రాజకీయంగా ఎదుగనివ్వని నీకు.. నేడు రాజకీయం చేయడానికి మాత్రం దళిత పథం కావాల్నా?’ అంటూ నిలదీశారు.
చండూరు, ఆగస్టు 6 : పూటకో మాట చెపుతూ కాంగ్రెస్ కార్యకర్తలకు తీరని అన్యాయం చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, చండూరు మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ అన్నెపర్తి శేఖర్ ప్రకటించారు. రాజగోపాల్‌రెడ్డివి ఓట్ల కోసమే అన్నీ ఆర్భాట ప్రకటనలేనని, ఒక్కటి కూడా చేసింది ఏమిలేదని ఆరోపించారు. తన రాజకీయ పబ్బం కోసం కార్యకర్తలను నమ్మిస్తూ భ్రమింప చేయడంలో దిట్ట అని, ఆయన నైజాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం చండూరులో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించి రాజగోపాల్‌రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ముందు ప్రభు త్వ నిధులే కాదు రూ.వందల కోట్ల తన సొంత డబ్బులతో అనేక చెరువులు, పరిశ్రమలు, దవాఖానలు, అంబులెన్స్‌లు, యువతకు ఉపాధి, పేదలకు ఇండ్లు కల్పిస్తామని హామీల వరదలు పారించారని గుర్తు చేశారు. ఇలాంటి మాయమాటలతో ప్రజలను, తమ లాంటి మండల స్థాయి ప్రజాప్రతినిధులను నమ్మించి గెలిచాడన్నారు. నియోజకవర్గంలో ఒక్క దళితున్ని కూడా రాజకీయంగా ఎదగనివ్వలేదని, ఎలాంటి సహాయం చేయలేదని, ఆయన రాజకీయం చేయడానికి మాత్రం దళిత పదం కావాలా అని ప్రశ్నించారు. పట్నంలో జై బీజేపీ, జై ఈటల అంటూ పల్లెల కొస్తే జై కాంగ్రెస్ అనడం ఆయనకే చెల్లిందన్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక సెల్ఫ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రాజగోపాల్‌రెడ్డిని పట్టించుకోవడం లేదంటే ఆయన స్థానం కాంగ్రెస్‌లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. అసలే అహంకారం దానికి తోడు ఇప్పుడు అసహనం తోడై ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అర్థం కాని స్థితిలో ఉన్నాడని చెప్పారు. తనలో ఉన్న అపరిచితుడు క్యారెక్టర్ బయటకు వచ్చి మంత్రి జగదీశ్‌రెడ్డి మీద గాయిగాయి చేసిండని వ్యాఖ్యానించారు. తన కోసం నినాదాలు చేసి నాయకులు, కార్యకర్తలు స్టేషన్లో ఉంటే ఆయన మాత్రం ఏసీలో తిరుగుతున్నాడని విమర్శించారు. గతంలో జగన్‌తో పాటు జైల్లో ఉండాల్సిన రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ముసుగులో బయటపడ్డారని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ఇలాంటి మతిలేని నాయకున్ని నమ్ముకుంటే అభాసుపాలై జైలు పాలు కాక తప్పదన్నారు. అధిష్ఠానం కూడా ఆయన్ని వదిలేసిందని, రాజగోపాల్‌రెడ్డి నాయకత్వంలో ఉండలేకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని అన్నెపర్తి శేఖర్ ప్రకటించారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్ నేతలే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.