
గజ్వేల్/వర్గల్, ఆగస్టు 6: సీఎం కేసీఆర్ అంటే గొల్లకుర్మలకు కొమురవెల్లి మల్లన్న, బీరన్న స్వరూపమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండల కేంద్రంలో గొర్లు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీని ఆయన ప్రారంభించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గొర్లు, మేకల దాణా, వ్యాధులకు చికిత్స మందులు, విజయడెయిరీ స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గంలోనే రెండో విడుత గొర్రెల పంపిణీని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలో ప్రారంభిస్తామన్నారు. రెండో విడుతకు రూ.6 వేల కోట్లు విడుదల చేశారన్నారు. వారం రోజుల్లో డీడీలు కడితే, పది రోజుల్లో గొర్రెలను పంపిణీ చేస్తామని హామీనిచ్చారు. గొల్లకుర్మలను ఏ ప్రభుత్వమూ ఆలోచన చేయలేదన్నారు. ఎన్నికల సమయాల్లోనే రాజకీయ పార్టీలన్నీ గొల్లకుర్మ సంఘాలు ఎక్కడున్నాయం టూ వెతికిమరీ ఓట్లు వేయించుకుని తర్వాత మరిచిపోయారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే గొల్లకుర్మల ఆర్థికాభివృద్ధిని కాంక్షించి సీఎం కేసీఆర్ సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టారన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాదిమంది గొర్లకాపరులు లబ్ధిపొంది ఆర్థికంగా అభివృద్ధి చెందారన్నారు.
కోటీశ్వరులను చేయాలని..
గొల్లకుర్మలను కోటీశ్వరులను చేయడానికి సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ ప్రవేశపెట్టి, రెండో విడుతలో యూనిట్ విలువను రూ.1.75 లక్షలకు పెంచుతూ రూ.6 వేల కోట్లు కేటాయించారని మంత్రి చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న పనికిమాలిన విమర్శలను ఎప్పటికప్పుడూ తిప్పికొట్టే బాధ్యత గొల్లకుర్మలందరిపై ఉందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెలను పెద్దయ్యాకే అమ్ముకోవాలని లేదంటే కాపరులు నష్టపోతారని మంత్రి సలహా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నట్టల నివారణ మందుల పంపిణీని గొల్లకుర్మలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యం..
గ్రామీణస్థాయిలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి తలసాని అన్నా రు. గొల్లకుర్మలతో పాటు, రజకులు, మంగళి, ముదిరాజ్.. అన్ని కులాల సంక్షేమానికి అవసరమైన పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. మిషన్ కాకతీయ ద్వా రా చెరువుల అభివృద్ధితో పాటు కాళేశ్వరం జలాలతో వాటిని నింపడంతో రైతులందరికీ సాగునీటిని ఢోకా లేకుండా పోయిందన్నారు. ముదిరాజ్‌లు, మత్స్యకార్మికులందరికీ చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలను వేయడంతో మంచి ఉపాధి లభించిందని, వారంతా సంతోషంగా ఉన్నారన్నారు. ఈ ఏడు చేపపిల్లల పంపిణీకి రూ.93 కోట్లు కేటాయించామన్నా రు. గొల్లకుర్మలకు వర్గల్లో కమ్యూనిటీహాలు నిర్మాణానికి రూ.15 లక్షలు మం జూరు చేస్తామన్నారు.
గజ్వేల్ ప్రజలంతా గర్వపడాలి..
గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులని, ఎక్కడికి వెళ్లినా సీఎం కేసీఆర్ నియోజకవర్గ వారిమని గొప్పగా చెప్పుకునేలా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని పరిపాలిస్తున్నారని మంత్రి అన్నారు. రాష్ట్రంతో పా టు గజ్వేల్ నియోజకవర్గాన్ని సైతం దేశానికి, రాష్ర్టానికి ఆదర్శవంతంగా అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నందుకు ఈ నియోజకవర్గ ప్రజలంతా గర్వపడాలన్నారు. గజ్వేల్ నియోజకవర్గం భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
రూ.30 లక్షలతో గొర్రెల మార్కెట్..
యాదవుల కోరిక మేరకు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి గొర్రెల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకురాగా, ఆయన సానుకూలంగా స్పందించారు. గజ్వేల్ నియోజకవర్గంలో గొర్రెల మార్కెట్ నిర్మాణానికి రూ.30 లక్షల కేటాయిస్తామని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. మార్కెట్‌కు అవసరమైన 5 ఎకరాల భూమిని గుర్తించి కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వర్గల్ మల్లన్న ఆలయ అభివృద్ధికి రూ.5 లక్షలు ఇస్తామని సభాముఖంగా ప్రకటించారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనిత రాజేంద్ర, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి సత్యప్రసాద్, ‘గడా’ ప్రత్యేకాధికారి ము త్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, గజ్వే ల్ పశు సంవర్ధకశాఖ ఏడీ రమేశ్‌బాబు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఎంపీపీ లతా రమేశ్‌గౌడ్, జడ్పీటీసీ బాలమల్లు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.