మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏటా ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నది. గతేడాది భారీ వర్షాలు కురవడం.. చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరు ఉండటంతో చేపల ఉత్పత్తి భారీగా పెరిగింది. దీంతో మత్స్యకారులు పెట్టిన పెట్టుబడికి మూడింతల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో చెరువులో రూ.లక్ష విలువైన చేపపిల్లలను వదలగా.. వాటి విక్రయంతో ఒక్కో మత్స్యకార కుటుంబం రూ.3 లక్షల వరకు ఆదాయం పొందింది. గతేడాది జిల్లాలో కోటీ 30 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయగా.. ఈసారి కోటీ 80 లక్షలు అందించేందుకు జిల్లా మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే గత సంవత్సరం కన్నా 50 లక్షల చేప పిల్లలను అధికంగా అందజేయనున్నారు. టెండర్ల్ల ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెల నుంచి చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 103 మత్స్యకారుల సొసైటీలుండగా 6616 మంది సభ్యులు ఉన్నారు.
రంగారెడ్డి, ఆగస్టు 6, (నమస్తే తెలంగాణ): జిల్లాలోని మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయి. మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. గత ఐదేండ్లుగా మత్స్యకారులకు వందశాతం సబ్సిడీతో చేపపిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే నాలుగు దఫాల్లో చేపల పెంపకంతో సంబంధిత చేపలను విక్రయించిన మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతమయ్యారు. గతేడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో చేపల ఉత్పత్తి భారీగా పెరిగిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. గతేడాది పెట్టిన పెట్టుబడికి మూడింతల ఆదాయం మత్స్యకారులు పొందినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో చెరువులో రూ.లక్ష విలువైన చేపపిల్లలను వదలగా, వాటి విక్రయంతో ఒక్కో మత్స్యకారు కుటుంబం రూ.3 లక్షల వరకు ఆదాయం పొందారు. గతేడాది జిల్లాలో కోటి 30 లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదలగా, ఈ ఏడాది 50 లక్షలమేర అధికంగా చేప పిల్లలను వదలేందుకు జిల్లా మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఏడాది టార్గెట్ కోటి 80 లక్షలు..
జిల్లాలో ఈ ఏడాది 1.80కోట్ల చేప పిల్లలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది చిన్న, పెద్ద పరిమాణంగల చేప పిల్లలను జిల్లాలోని చెరువుల్లో పెంచేందుకు నిర్ణయించారు. పెద్ద చేప పిల్లలు (82-100 మి.మీటర్లు), చిన్న చేపపిల్లలు(35-40 మి.మీటర్లు) రెండు రకాల చేపలను పెంచనున్నారు. చేప పిల్లల విత్తనాలను ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్ల ద్వారా జిల్లాకు చేప పిల్లల విత్తనాలను సమకూర్చనున్నారు. ఈనెలాఖరులోగా ఆన్లైన్లో విత్తనాల కోసం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేందుకుగాను జిల్లా మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే వచ్చేనెలలో చేపపిల్లల విత్తనాలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి అలుగు పారుతున్న నేపథ్యంలో అలుగు తగ్గిన తర్వాత చేప పిల్లలను వదలనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 576 చెరువుల్లో చేపల పెంపకం జరుగుతున్నది. సంబంధిత చెరువుల్లో 119 చెరువులు మైనర్ ఇరిగేషన్ ఆధ్వర్యంలో ఉండగా, మిగతా 417 చెరువులు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చెరువుల విస్తీర్ణాన్ని బట్టి చేపలను పెంచుతున్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా గ్రామ కార్యదర్శి తదితరులతో కూడిన గ్రామస్థాయిలో కమిటీలను కూడా ప్రభుత్వం నియమించింది.
జిల్లాలో 103 మత్స్యకారుల సొసైటీలుండగా.. వీటిలో 12 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలు ఉన్నాయి. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 6616 మంది సభ్యులున్నారు. జిల్లాలో పెంచిన చేపలను ఇతర ప్రాంతాలకు తరలించకుండా హైదరాబాద్‌తో పాటు స్థానికంగా విక్రయించేందుకుగాను అధికారులు చర్యలు చేపట్టారు. చేపలను విక్రయించేందుకుగాను 70శాతం సబ్సిడీతో వాహనాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే మత్స్యకారులకు అందజేసింది. అంతేకాకుండా చేపలను భద్రపరిచేందుకుగాను ఐస్ బాక్సులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ నెలాఖరులోగా టెండర్లు పూర్తి చేస్తాం
ఈ ఏడాది చేపల పెంపకం కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాం. చేప పిల్లల కొనుగోలుకు ఈనెలాఖరులోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. చెరువుల్లో అలుగు పారుతున్నందున తగ్గిన వెంటనే చేప పిల్లలను వదిలే ప్రక్రియ ప్రారంభిస్తాం. జిల్లాలో ఈ ఏడాది కోటి80 లక్షల చేప పిల్లలను 576 చెరువుల్లో పెంచేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశాం. అక్రమాలకు తావులేకుండా అర్హులైన మత్స్యకారులకే చేపపిల్లలను పంపిణీ చేస్తాం.