
“అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమివ్వడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు 2018 తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పట్టం కట్టారు. ఇది జిల్లాలో పార్టీ బలాన్ని, కార్యకర్తల, నాయకుల సమష్టి కృషిని తెలియజేస్తుంది”. అని రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గురువారం మంత్రి అజయ్‌కుమార్ ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..“అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదు.. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్కు తిరుగులేదు. భవిష్యత్‌లో గులాబీ పార్టీని ఢీకొట్టే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదు. సంక్షేమం, అభివృద్ధితో ప్రజల మనసు గెలుచుకున్నది. ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారు. అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ అజయ్ ఆత్మీయుడే..” అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. జనవరి 2వ తేదీన ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’కి ఇంటర్యూ ఇచ్చారు.
ఉమ్మడి జిల్లాలో శరవేగంగా అభివృద్ధి
ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నది. అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఖమ్మంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజల దరి చేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాను. నేను రెండోసారి శాసన సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిగా అవకాశం ఇచ్చారు. తర్వాత ఖమ్మం నగరంతోపాటు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరిగింది. ఇప్పటికే ఖమ్మంలో ఆధునిక వసతులతో ఆర్టీసీ బస్టాండ్, ఐటీ హబ్, సమీకృత కూరగాయల మార్కెట్, నగరంలో అంతర్గత రహదారుల విస్తరణ వంటి పనులతో నియోజకవర్గం అగ్రగామిగా ఉంది.
2వ తేదీన మంత్రి కేటీఆర్ రాక
రాష్ట్ర ఐటీ పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జనవరి 2వ తేదీన ఖమ్మంతో పాటు సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.30 కోట్లతో చేపట్టే గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ పనులు, రూ.20కోట్లతో నిర్మించే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీకి శంకుస్థాపన చేయనున్నారు. రూ.8.50 కోట్లతో నగరప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు పర్యాటకంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. నగరంలో దాదాపు రూ.1000 నుంచి రూ.1500 కోట్లతో అనేక అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఖమ్మం నగరంలో రూ.230 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధజలం అందజేస్తున్నాం. రూ.70 కోట్లతో గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ పనులు చేపట్టామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అందిస్తున్న రూ.100 కోట్ల ఎల్ఆర్ఎస్ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. నగరంలో దాదాపు రూ.200 కోట్లతో 2వేల డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు కేటాయించాం. రఘునాథపాలెం మండలంలో రూ.75 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామని, నగరం నుంచి బోనకల్లు వెళ్లేందుకు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని రూ.70 కోట్లతో ధ్వంసలాపురం వద్ద రైల్వే ఓవర్‌బ్రిడ్జిని నిర్మించామని మంత్రి పేర్కొన్నారు.
ఐటీ రంగలో మేటి
హైదరాబాద్ నగరం తర్వాత ఐటీ రంగంలో ఖమ్మం దూసుకెళ్తున్నది. రూ.15 కోట్లతో ఆధునిక వసతులతో ఐటీ హబ్ నిర్మించాం. అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. రూ.30 కోట్ల వ్యయంతో ఐటీ హబ్ రెండో దశ నిర్మాణ పనులు త్వరలో పూర్తికానున్నాయి. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిగా తీర్చిదిద్దాం. దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో భవనాల నిర్మాణం, ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశాం. రూ.15 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం త్వరలో పూర్తికానున్నది. ఖమ్మంలోని లకారం చెరువును రూ.35 కోట్లతో ఆహ్లాదకర పార్కుగా తీర్చిదిద్దాం. మంత్రిగా వివిధ ప్రభుత్వశాఖల నుంచి ప్రత్యేక నిధులను మంజూరు చేయించి ఖమ్మంలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తున్నాం. ఖమ్మం నగర కార్పొరేషన్ వార్షిక ఆదాయం రూ.80 కోట్లలో రూ.30 కోట్ల వ్యయంతో కొత్త సంవత్సరం అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నాం. ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించామని, ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పూర్తి సహాయ, సహకారాలు, అండదండలు అందించారని మంత్రి వివరించారు.