యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో ఆళ్వారు దివ్య ప్రబంధ
అధ్యయ నోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజైన సోమవారం ఉదయం స్వామివారు వటపత్రశాయిగా, రాత్రి వైకుంఠ నాథుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. బాలాలయంలోని తిరువీధుల్లో పురప్పాట్ సేవలు కనులపండువగా సాగాయి. దివ్య ప్రబంధ పారాయణాలతో అర్చకులు, పారాయణికులు శ్రీవారిని కొలిచారు.
యాదాద్రి, జనవరి17 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఆళ్వారు దివ్య ప్రబంధ అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఐదో రోజు స్వామివారు ఉదయం వటపత్రశాయిగా, రాత్రి పరమపదనాథుడిగా(వైకుంఠనాథుడు) భక్తులకు దర్శనం ఇచ్చారు. బాలాలయంలోని తిరువీధుల్లో నమ్మాళ్వారు, రామానుజ ఆళ్వారు, తిరుప్పన్ ఆళ్వారు, తిరుమంగై ఆళ్వారు, వనమావళైజీయర్ ఉత్సవమూర్తులతోపాటు స్వామివారి అలంకార సేవలైన వటప్రతశాయి, వైకుంఠనాథుడి సేవలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు, పారాయణీకులు స్వామివారికి నవకలశాభిషేకం, మూలమంత్ర హోమాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. దివ్య ప్రబంధ పారాయణాలతో స్వామిని కొలిచారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.గీత, ప్రధానార్చకులు నల్లంథీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, సహాయ కార్యనిర్వహణాధికారి గజవెల్లి రమేశ్‌బాబు పాల్గొన్నారు.
పరమపద ఉత్సవం అంటే..
శ్రీవైష్ణవ ఆలయంలో నిర్వహించబడు అధ్యయనోత్సవం ఎంతో ప్రాశస్త్యం పొందింది. ఈ పరమపద ఉత్సవ విశేషం మోక్షోత్సవం, వైకుంఠ ఉత్సవం ప్రత్యేకతను సూచిస్తున్నది. దివ్య ప్రబంధ అధ్యయన కాలం తొలగించిన పిదప అధ్యయనోత్సవం నిర్వహించడం ఆలయ సంప్రదాయం. ఆళ్వారాదులు స్వామిని కీర్తించి ప్రసన్నుని గావించుకొని నమ్మాళ్వారులు తమను కటాక్షించాల్సిందిగా ప్రార్థించి వారి అనుగ్రహ విశేషంతో ఈ పరమపదోత్సవాన్ని నిర్వహిస్తారు. పరమపదనాథుడి సర్వావయవ సందర్భనం ముక్తిప్రదం అని, శంఖు, చక్ర, గదాధారియై శ్రీవైకుంఠ నిత్యనివాస అధిపతియైన పరమపదనాథుడిని వివిధ వేదాలతో, స్తోత్రములతో స్తుతించి భగవదానుగ్రహం పొందుట ఈ వేడుకలోని ప్రత్యేకత.
పరమశివుడికి రుద్రాభిషేకం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధాలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో పరమశివుడికి పురోహితులు అత్యంత వైభవంగా రుద్రాభిషేకం నిర్వహించారు. కొండపైన బాల శివాలయంలో ప్రభాతవేళ గంటన్నరపాటు భక్తులు శివుడిని కొలుస్తూ మమేకమయ్యారు. ఉదయాన్నే శివుడిని పంచామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడిని విభూతితో అలంకరించారు. శివాలయం ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి కవచమూర్తులను అభిషేకంతో అర్చించారు. బాలాలయంలో సాయంత్రం స్వామి, అమ్మవార్లకు వెండిజోడు సేవను అత్యంత వైభవంగా జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి నిత్య కైంకర్యాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని సామూహిక వ్రతం ఆచరించారు. పూర్వగిరి (పాతగుట్ట) నరసింహస్వామి నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు రూ.10,58,117 ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎన్.గీత తెలిపారు.
నేడు పరిసమాప్తి..
అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారు లక్ష్మీనరసింహస్వామి అలంకార సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం అధ్యయనోత్సవాలకు ఆలయ అర్చకులు పరిసమాప్తి పలుకనున్నారు.
శ్రీవారి ఖజానాకు ఆదాయం(రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 62,700
రూ.100 దర్శనం టిక్కెట్ 12,000
వీఐపీ దర్శనం 45,450
వేద ఆశీర్వచనం 1,800
సుప్రభాతం 1,000
ప్రచార శాఖ 17,900
క్యారీ బ్యాగుల విక్రయం 5,500
వ్రత పూజలు 71,200
కళ్యాణకట్ట టిక్కెట్లు 19,200
ప్రసాద విక్రయం 5,92,200
శాశ్వత పూజలు 10,000
వాహన పూజలు 10,700
టోల్గేట్ 1,100
అన్నదాన విరాళం 377
సువర్ణ పుష్పార్చన 55,000
యాదరుషి నిలయం 50,580
పాతగుట్ట నుంచి 43,130
గోపూజ 400
ఇతర విభాగాలు 54,880