యాదాద్రి, ఏప్రిల్ 10 : యాదాద్రి స్వయంభువుడైన లక్ష్మీనర్సింహ స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎటుచూసినా క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కుటుంబసభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడి దర్శనానికి గంటల కొద్ది క్యూలో నిలుచున్నారు. స్వామికి తలనీలాలు సమర్పించేందుకు వచ్చే భక్తులతో కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ వాహనాలను కొండకింద పార్కు చేసి దేవాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత బస్సుల్లో కొండపైకి చేరుకున్నారు.
స్వయంభువుల ప్రధానాలయంలో స్వామి, అమ్మవారికి నిత్య పూజల కోలాహలం తెల్లవారు జామున 4గంటల నుంచి మొదలైంది. తెల్లవారుజామున సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదనలు అర్పించారు. అనంతరం బిందెతీర్థం, ఆరాధన గావించారు. ఉదయం 5గంటలకు స్వామివారికి బాలభోగం నిర్వహించారు. అనంతరం స్వామి పుష్పాలంకరణ సేవలో భాగంగా వివిధ రకాల పూలతో స్వామి, అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించారు. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి ఉత్సవమూర్తులకు అభిషేకించి సహస్రనామార్చనతో స్వామివారిని అర్చించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 94,950
వేద ఆశీర్వచనం 1,800
సుప్రభాతం 12,900
క్యారీబ్యాగుల విక్రయం 28,000
వ్రత పూజలు 87,200
కళ్యాణకట్ట టిక్కెట్లు 37,600
ప్రసాద విక్రయం 13,78,550
వాహనపూజలు 7,800
అన్నదాన విరాళం 8,894
సువర్ణ పుష్పార్చన 1,95,000
యాదరుషి నిలయం 83,560
పాతగుట్ట నుంచి 58,930
శాశ్వత పూజలు 5,000
గోపూజ 100
లక్ష్మీపుష్కరిణి 400