యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. కొండపైన క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయాశాల, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి జనంతో కిటకిటలాడాయి.
యాదాద్రి, మే 1 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. స్వయంభువులను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో క్యూ కట్టారు. సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండకింద పాత గోశాల వద్ద మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సులు, వీఐపీ మినహా కొండపైకి ఇతరుల వాహనాలను అనుమతించలేదు. స్వామికి నిత్యపూజలు తెల్లవారుజాము మూడున్నర గంటల నుంచి మొదలయ్యాయి. స్వామిని సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చక బృందం తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి స్వయంభువులకు అభిషేకం చేశారు.
అనంతరం స్వామికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. అనంతరం భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ చేపట్టారు. రాత్రి 7గంటల నుంచి అరగంట పాటు స్వామివారికి తిరువారాధన నిర్వహించిన అనంతరం స్వామికి తులసి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన నిర్వహించారు.
స్వామి, అమ్మవార్లకు నిత్యకల్యాణోత్సవం వైభవంగా జరిపారు. పాతగుట్ట ఆలయంలో నిత్యోత్సవాలు శాస్ర్తోక్తంగా జరిగాయి. ప్రధానాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలు కలుపుకుని స్వామి ఖజానాకు రూ. 25,76,910 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
శ్రీవారిని ప్రముఖులు కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పి.శ్రీసుధ, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర ఎండోమెంట్ ట్రిబ్యునల్ డి.రవీందర్‌శర్మ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీ సమీర్‌శర్మ కుటుంబ సమేతంగా వేర్వేరుగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. ప్రాకారంలోని అద్దాల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందించారు.
యాదాద్రి ఆలయ ఇన్చార్జి ఈఓగా రామకృష్ణారావు వ్యవహరించనున్నారు. ప్రస్తుత ఈఓ ఎన్.గీత ఆదివారం నుంచి 10 రోజుల పాటు సాధారణ సెలవుపై వెళ్లారు. అప్పటివరకు హైదరాబాద్‌లోని దేవాదాయ, దర్మధాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న రామకృష్ణారావు ఇన్చార్జి ఈఓగా కొనసాగనున్నట్లు సమాచారం.