భువనగిరి మండలం అనంతారం గ్రామ పరిధిలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పూజలందుకుంటోంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా హైదరాబాద్, వరంగల్, జనగాం నుంచి సైతం భక్తులు ఎల్లమ్మను దర్శించుకునేందుకు వస్తుంటారు. ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ తన పరిధిలోకి తీసుకుంది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 9 : భువనగిరి మండల పరిధిలోని అనంతారం గ్రామ సమీపంలో గల రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు శనివారం ఉత్తర్వులను జారీచేసింది. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆలయాన్ని దేవాదాయ పరిధిలోకి తెచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేశారు. ఎన్నోమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కొందరు భక్తులు, స్థానికులు ఆలయాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకోవాలని హైకోర్టులో పిటీషన్ వేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు దేవాదాయశాఖ అధికారులు విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమర్పించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు శనివారం ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నారు. ఆలయ నిర్వహణ కోసం ఈఓను కూడా నియమించారు.
రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని పూర్తిగా దేవాదాయ ధర్మాదాయశాఖ పరిధిలో తీసుకున్నాం. కొబ్బరికాయలు, బొమ్మలు, పూజాసమాను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయిస్తాం. భక్తుల సౌకర్యార్థం నేటి నుంచి క్యూలైన్లో ఉచిత దర్శనం, జంతుబలి, బోనం, ఒడిబియ్యం పోసిన డబ్బులు ఇవాల్సిన అవసరం లేదు. కొబ్బరికాయలు, ఇతరాత్ర సామగ్రి విక్రయించడానికి త్వరలో టెండర్లు పిలుస్తాం. ఆలయ హుండీలోని రూ.75లక్షలను ఇప్పటికే అమ్మవారి పేరుతో తీసిన ఖాతాలో జమచేశాం.