యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/యాదాద్రి : “నారసింహుని దర్శనం తర్వాత శివయ్య దర్శనం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న భక్తుల కోరిక తీరింది. హరిహరులను ఒకే చోట స్మరించుకునే కమనీయ ఘట్టం సోమవారం యాదాద్రిలో ఆవిష్కృతమైంది. ఆరు రోజులుగా స్మార్త ఆగమ శాస్త్రరీత్యా మహాకుంభాభిషేక మహోత్సవాలను నిర్వహించి శివాలయాన్ని పునఃప్రారంభించారు.
వేద పండితుల మంత్రోఛ్చారణల నడుమ అంగరంగ వైభవంగా ముగిసిన వేడుకల అనంతరం పార్వతీపరమేశ్వరుల నిజరూపాలు దర్శనమివ్వడంతో యావత్ భక్తజనంలోనూ భక్తి పారవశ్యం ఉప్పొంగింది. మార్చి 28న స్వయంభువుల దర్శన భాగ్యం కల్పించిన సీఎం కేసీఆర్ సోమవారం శివాలయం మహాకుంభాభిషేకంలో సతీసమేతంగా పూజలు నిర్వహించి హరిహరులను ఒకే ప్రాంగణంలో దర్శించుకునే భాగ్యాన్ని కల్పించారు.”
పంచనారసింహుల దివ్యక్షేత్రం అనుబంధ శివాలయం పునఃప్రారంభం కావడంతో యాదాద్రిలో ఆధ్యాత్మికత పరిఢవిల్లింది. ఉదయం 10.25 గంటలకు ధనిష్టా నక్షత్ర యుక్త మిథునలగ్న పుష్కరాంశ సముహూర్తమున శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మాధవానంద సరస్వతీస్వామి చేతులమీదుగా సపరివార శ్రీ రామలింగేశ్వర స్పటికలింగ ప్రతిష్ఠ, అష్టబంధము, ప్రాణ ప్రతిష్ఠ, ప్రతిష్ఠాంగ హోమం, అఘో మంత్రహోమం, దిగ్దేవతాక్షేత్రపాల బలిహరణం, శోభాయాత్ర, కలశ ప్రతిష్ఠా పర్వాలను నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మహాపూర్ణాహుతి, అవబృధము, మహా కుంభాభిషేకం నిర్వహించి పునఃదర్శనాలకు తెరతీశారు. ఈ మహాక్రతువులో సీఎం కేసీఆర్ తన సతీమణితో పాల్గొని తొలి పూజలు నిర్వహించారు.
శివాలయం పునర్నిర్మాణం సందర్భంగా భక్తులకు ఆరేళ్లుగా పార్వతీపరమేశ్వరుల దర్శనాలను బాల శివాలయంలో కల్పించారు. కృష్ణశిలలతో అత్యద్భుతంగా శివాలయం పునర్నిర్మితమైన ఆరేళ్ల తర్వాత సోమవారం భక్తులకు నిజ రూపాలు దర్శించుకునే భాగ్యం కలగడంతో భక్తులు పరవశించిపోయారు. మధ్యాహ్నం తర్వాత దర్శ నం కల్పించడంతో రాత్రి వరకు శివాలయంలో భక్తులు పోటెత్తారు. నారసింహుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు పక్కనే ఉన్న శివాలయాన్ని సైతం దర్శించుకుని తన్మయులయ్యారు.
సరిగ్గా 29 రోజుల కింద మహాకుంభ సంప్రోక్షణ పర్వాలతో స్వయంభూ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రాన్ని పునఃప్రారంభించిన యాదాద్రి రూపశిల్పి ముఖ్యమంత్రి కేసీఆర్ అదేస్థాయిలో యాదగిరిగుట్టకు అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయాన్ని పునఃప్రారంభించారు. ప్రధానార్చకులు, ప్రధాన పురోహితులు, యాజ్ఞీకులు, పారాయణీకులు, రుత్వికులు, పురోహితులు, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుము స్మార్తగమశాస్త్రరీతిలో రామలింగేశ్వరస్వామివారి ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఉదయం 11.56 గంటలకు యాదాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ముందుగా ప్రెసిడెన్సియల్ సూట్ చేరుకున్నారు. అక్కడే సంప్రదాయ వస్ర్తాలను ధరించి నేరుగా స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చక బృందం, అధికారులు త్రితల రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు స్వయంభూ గర్భాలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేపట్టారు.
ప్రధానాలయ ముఖ మండపంలో సీఎం కేసీఆర్ దంపతులకు ప్రధానార్చకులు స్వామివారి వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈఓ ఎన్ గీత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వామివారి మహాప్రసాదాన్ని అందజేశారు. అనంతరం శివాలయ ముఖమండపంలో ప్రతిష్ఠించిన స్ఫటికలింగేశ్వరస్వామికి గోత్ర నామ ఉచ్ఛరణ, పంచామృతాలు, ఫలరసాలు, నారికేళ నీళ్లతో పూజా ఉపచారాలు చేపట్టారు.
శివాలయ మహాకుంభాభిషేకంలో భాగంగా ఉదయం కలశాల సంప్రోక్షణ క్రతువులు నిర్వహించారు. వీటిని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం పర్వాలను చేపట్టగా సీఎం కేసీఆర్ తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. ఆతర్వాత స్వామివారి అనుగ్రహ భాషణం చేపట్టారు. చివరగా మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ చేపట్టి ప్రతిష్ఠాయాగపరికి సమాప్తి పలికారు. ఈ వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, కలెక్టర్ పమేలా సత్పతి, సీఎంఓ భూపాల్‌రెడ్డి, దేవాదాయ కమిషనర్ అనిల్‌కుమార్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆలయ ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ఈఓ గీత, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధాహేమేందర్ గౌడ్, జడ్పీటీసీ అనూరాధాబీరయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఉదయం 11.56 కి యాదాద్రికి సీఎం కేసీఆర్
మధ్యాహ్నం 12.07 గంటలకు ప్రెసిడెన్సియల్ సూట్‌కు సీఎం కేసీఆర్
మధ్యాహ్నం 12.15 గంటలకు కొండపైకి సీఎం కేసీఆర్
మధ్యాహ్నం 12.18 గంటలకు యాదాద్రి స్వయంభూ ఆలయం వద్ద సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభ స్వాగతం
మధ్యాహ్నం 12.24 గంటలకు స్వామివారి గర్భాలయంలోకి సీఎం కేసీఆర్ దంపతులు
మధ్యాహ్నం 12.36 గంటలకు సీఎం కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనం ఇచ్చిన ప్రధానార్చకులు
మధ్యాహ్నం 12.37 గంటలకు సీఎం కేసీఆర్‌కు ప్రసాదం అందజేస్తున్న దేవదాయశాఖ కమిషనర్అనిల్కుమార్
మధ్యాహ్నం 12.46 గంటలకు శివాలయంలోకి సీఎం కేసీఆర్
మధ్యాహ్నం 1.03 గంటలకు స్పటికలింగేశ్వస్వామివారి అభిషేకం నిర్వహించిన కేసీఆర్ దంపతులు
మధ్యాహ్నం 1.12 గంటలకు యాగశాలలో మహాపూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు
మధ్యాహ్నం 1.36 గంటలకు శివాలయం నుంచి బయటకు వచ్చిన సీఎం కేసీఆర్ దంపతులు
మధ్యాహ్నం 1.44 గంటలకు ప్రెసిడెన్సియల్ సూట్‌కు సీఎం కేసీఆర్ దంపతులు
మధ్యాహ్నం 3.15 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం