యాదాద్రి, ఏప్రిల్ 23 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దివ్యక్షేత్రంలో శనివారం నిత్యపూజల కోలాహలం కొనసాగింది. పలు ప్రాంతాల నుంచి భక్తుల అధిక సంఖ్యలో రావడంతో సందడి నెలకొంది. ప్రధానాలయంలోని స్వయంభువులకు నిజాభిషేకం మొదలుకొని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు.
ఉదయం 8 గంటలకు ప్రాకారంలో నిర్వహించిన సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. స్వామివారి నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి ప్రాకార మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతు నిర్వహించారు.
సాయంత్రం స్వామివారి వెండి మొక్కు జోడు సేవలు, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేశారు. వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు జరిపారు. శ్రీవారి ఖజానాకు రూ.18,74,524 ఆదాయం సమకూరినట్లు ఈ ఎన్. గీత తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్‌రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. శనివారం ఉదయం యాదాద్రికి చేరుకున్న ఆయన స్వయంభువును దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధానాలయ అద్దాల మండపం వద్ద జస్టిస్ దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
కెనరా బ్యాంక్ సీజీఎం పట్నాయక్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రూ.12.50 లక్షల విలువైన డీసీఎం వాహనాన్ని అందజేశారు. శనివారం వాహనాన్ని ఆలయ ఈఓ ఎన్. గీతకు అప్పగించారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 1,76,050
వీఐపీ దర్శనాలు 1,20,000
రూ. 100 దర్శనం 34,100
వేద ఆశీర్వచనం 12,000
నిత్యకైంకర్యాలు 5,502
సుప్రభాతం 5,700
క్యారీబ్యాగుల విక్రయం 15,000
వ్రత పూజలు 1,54,400
కళ్యాణకట్ట టిక్కెట్లు 27,600
ప్రసాద విక్రయం 9,22,750
వాహనపూజలు 13,400
గోపూజ 200
అన్నదాన విరాళం 18,031
శాశ్వత పూజలు 10,000
సువర్ణ పుష్పార్చన 1,82,632
యాదరుషి నిలయం 1,00,480
పాతగుట్ట నుంచి 44,930