యాదాద్రి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పంచకుండాత్మక మహాకుంభాభిషేక ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. మూడోరోజు శుక్రవారం స్థాపిత దేవతాయజన, మూలమంత్రనుష్టాన హవనాలు, వేదికాత్రయ ప్రోక్షణ, బలిహరణం కార్యక్రమాలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ప్రతిమానయానం, నేత్రోన్మీలనం, స్నపనం, మూర్తిపతి లోకపాల స్థాప్యదేవతాహవనం, వేద హవనం, నీరాజన మంత్రపుష్పాలతో స్వామివారిని కొలిచారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం నిత్యారాధనల అనంతరం పంచాహ్నిక, పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం శివాలయ ప్రాకారం మధ్యలో నిర్మితమైన యాగశాలలో ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్థాపిత దేవతాయజన, మూలమంత్రానుష్టాన హవనాలు, వేదికాత్రయ ప్రోక్షణ, బలిహరణం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ప్రతిమానయనం, నేత్రోన్మీలనం, స్నపనం, అర్చన, మూర్తిపతి లోకపాల స్థాప్యదేవతా హవనం, వేద హవనం, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాదాల వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి దంపతులు, ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, శివాలయ ప్రధానార్చకుడు నర్సింహరామ శర్మ, ప్రధాన పురోహితుడు గౌరీభట్ల సత్యనారాయణశర్మ, యజ్ఞబ్రహ్మ, ఆలయ సిద్ధాంతి, పారాయణీకులు, పురోహితులు పాల్గొన్నారు.
రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిత్యహవనాలు, పారాయణాలు, మూలమంత్ర జపాలు, పురాణ, ఇతిహాస పారాయణాలు, శివ పంచాక్షరీ జపాలను ఆలయ అర్చకులు, యజ్ఞాచార్యులు, రుత్వికులు, వేద పండితులు, పురోహితులు స్మార్తాగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ప్రధానంగా స్థాపిత దేవతాయజనమూల మంత్రానుష్ఠాన హవనాలు నిర్వహించారు. ఉత్సవమూర్తుల ప్రతిష్ఠకు ముందుగా ఆయా దేవతలకు సంబంధించిన మంత్రపూర్వక హవిస్సులను హవనంతో సమర్పించారు. స్థాపిత దేవతారాధనల అనంతరం మూలమంత్ర జపాలను అనుసరించి ఆయా దేవతలకు క్షీర, జల తర్పణాదులు గావించారు. మంత్రపూతమైన హవిస్సులు స్వీకరించి ఆయామూర్తులు విశ్వశాంతి గావించెదరని ఆలయ ప్రధాన పురోహితుడు గౌరీభట్ల సత్యనారాయణ శర్మ తెలిపారు.
సాయంకాలం కార్యక్రమాలు..
సాయంత్రం ఉపాలయంలో నిత్యారాధన అనంతరం యాగశాలలో ప్రతిమానయనం, నేత్రోన్మీలనం, స్నపనం, అర్చన, మూర్తిపతిలోకపాల స్థాప్యదేవతాహవనం, వేదహవనం, నీరాజన మంత్ర పుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ వేడుకలను యజ్ఞబ్రహ్మ, ఆలయ సిద్ధాంతి, ఆలయ ప్రధానార్చకుడు, అర్చకులు, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవ ప్రయుక్తమైన శిలాయమ, లోహమయ మూర్తులకు ప్రతిమానయన పూర్వకంగా శుద్ధి గావించి తత్సంబంధమైన నిత్యహవిస్సులు సమర్పించి పరమేశ్వరుడిని ప్రార్థించారు.
ప్రతిష్ఠామూర్తులకు నేత్రోన్మీలనం..
రామలింగేశ్వరాలయంతో పాటు ఉపాలయాల ప్రతిష్ఠామూర్తులకు, ఇతర దేవతాగణాలకు సర్వావయవ దోష నివారణార్థం అంగ, ప్రిత్యంగ శుద్ధి గావించుటకు సర్వావయవములను స్పృశిస్తూ వేదసూక్త మంత్ర పఠనాల మధ్య నేత్రోన్మీలన వేడుకను నిర్వహించారు. ప్రప్రథమంగా బింబిములలోని దృష్టి దర్పణాలపై ప్రసరింపజేసి ఆయా దర్పణాలలో ఆయామూర్తులను దర్శించుట ఆగమశాస్త్రంగా పేర్కొన్నారు. నేత్రోన్మీలన గావించిన మూర్తులకు శాస్ర్తానుసారంగా ఆర్చనలు చేపట్టారు.
బింబమూర్తులకు స్నపన వేడుకలు..
మూర్తులలో సర్వ విధ దోషాలను తొలగించేందుకు పవిత్రమైన నదీజలాలు, తీర్థాలను కలశాలలో ఆవాహనం గావించి స్నపన వేడుకను నిర్వహించారు. పంచామృతాలు, ఫలరసాలు, సుగంధ ద్రవ్య భరితమైన తీర్థరాజాలతో పంచసూక్తాది పఠనాలతో స్నపనాలను నిర్వహించారు. ఈ వేడుకతో మూర్తులను ఆశ్రయించి సర్వ దోషాలు తొలగి ప్రతిష్ఠాయోగ్యతను పొందుతారని రుత్వికులు, పురోహితులు తెలిపారు.
నేటి కార్యక్రమాలు..
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు యాగశాల ద్వారతోరణ పూజ, స్థాపితా దేవతాదీక్షాహోమం, మహాలింగార్చనలు, మహాన్యాస పారాయణం, మూలమంత్రానుష్టాన హవనాలు
సాయంత్రం 5.00 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ప్రసాద వాస్తు నిక్షేపణం, ప్రసాద వాస్తుశాంతి, ధాన్యాధివాసం, మూర్తి పతి, లకోపాల స్థాప్య దేవతా హవనాలు, నీరాజన మంత్రపుష్పాలు.