యాదాద్రి దివ్యక్షేత్రంలోని పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయం ఉద్ఘాటనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విఘ్నేశ్వరుడి పూజ, పుణ్యాహవాచనం, మాతృకాపూజ, నాందీముఖం, పంచగవ్య ప్రాశనం, రుత్విగ్వరణం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5 నుంచి 8.30 గంటల వరకు అంకురారోపణం, ఉదకశాంతి, రక్షోఘ్నహోమం చేపట్టారు. అంతకుముందు స్వయంభూ ప్రధానాలయంలోని పంచనారసింహుడి వద్దకు వెళ్లి ప్రధానార్చకులచే స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం ఆశించి ఉత్సవాల నిర్వహణకు అనుమతిని స్వీకరించారు.
పంచాహ్నిక పంచకుండాత్మక మహాకుంభాభిషేకం మహోత్సవాలకు ఆలయ అర్చకులు, బ్రహ్మ వేద పారాయణికులు, యజ్ఞాచార్యులు, రుత్వికులు, పరిచారకులు బుధవారం శ్రీకారం చుట్టారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విఘ్నేశ్వరుడి పూజ, పుణ్యాహవాచనం, మాతృకాపూజ, నాందీముఖం, పంచగవ్య ప్రాశనం, రుత్విగ్వరణం నిర్వహించారు. అంతకుముందు ప్రధానాలయంలోని పంచనారసింహుడి నుంచి ఉత్సవాల నిర్వహణకు అనుమతిని స్వీకరించారు. సాయంత్రం అంకురారోపణం, ఉదకశాంతి, రక్షోఘ్నహోమం చేపట్టారు. గురువారం యాగశాల ప్రవేశం నిర్వహించనున్నారు.
ఉత్సవాలు నిర్విఘ్నంగా జరుగాలని విఘ్నేశ్వరుడికి పూజలు.. సర్వవిధ దోషాలు తొలిగిపోయేందుకు శుద్ధి కార్యక్రమాలు.. పాలు, ఆవు నెయ్యితో అభిషేకాలు.. పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి మహాకుంభాభిషేక మహోత్సవాలకు అలయ అర్చకులు, పండితులు బుధవారం అత్యంత వైభవంగా శ్రీకారం చుట్టారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో బుధవారం నిత్యారాధనల అనంతరం పంచాహ్నిక, పంచకుండాత్మక మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పరమహంస, పరివ్రాజకాచార్యులైన శ్రీరాంపురం(తొగుట) పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతీస్వామి సూచనలతో స్మార్తాగమశాస్త్రం ప్రకారం అత్యంత వైభవంగా చేపట్టారు.
రామలింగేశ్వరస్వామివారి మాఢవీధుల్లో నిర్మించిన యాగశాల మందుబాగంలో ఉదయం 9.00 గంటలకు విఘ్నేశ్వర పూజ నిర్వహించారు. పంచాహ్నిక దీక్షావిధానంతో సుమారు 54 మంది ఆచార్య బ్రహ్మ వేద పారాయణ, యజ్ఞాచార్య, రుత్విక్, పరిచారిక బృందంతో స్మార్తాగమ సంప్రదాయరీతిలో సర్వవిధ విఘ్నాలు తొలగిపోయేందుకు విఘ్నాధిపతి అనుగ్రహాన్ని పొందారు. విఘ్నేశ్వర పూజతో మహోత్సవాలను ప్రారంభించిన అనంతరం స్వస్తీవాచనం, పుణ్యాహవాచనం నిర్వహించారు. నాందీముఖం, నాందీదేవతారాధన, హిడాహావాచనం, దేవతాహ్వానం, రక్షాబంధనం వంటి కార్యక్రమాలు యాగశాల ప్రాంగణంలో జరిగాయి. మాతృకాపూజలో భాగంగా భద్ర పీఠాల్లో గౌరీ దేవతను వివిధ స్వరూపాలతో ఆవాహన గావించి వివిధ మంత్రాలతో ఉపచారమలను నిర్వహించారు. ఈ వేడుకతో గౌరీ దేవత అనుగ్రహంతో సర్వవిధ శుభాలు కలుగుతాయని శివాలయ ప్రధాన పురోహితుడు సత్యనారాయణ శర్మ తెలిపారు.
మహాకుంభాభిషేకంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పంచగవ్య ప్రాశనం కార్యక్రమాన్ని జరిపారు. దేహంలో ఉన్న సమస్త దోష నివారణ నిమిత్తం పంచగవ్య హోమం, పంచగవ్య ప్రాశనం జరిపారు. స్తపతులు, శిల్పులు నూతన నిర్మాణాలు జరిపిన నేపథ్యంలో కలిగే దోషాలు తొలగిపోవడానికి ఊష్మాండ హోమాలు, ఘనహోమాలు జరిపారు. గోపంచకంతో ఆలయాన్ని శుద్ధి చేసి గోమయములతో అలకంరించారు. గోక్షీర, గోఘ్నతములతో అభిషేకించి పవిత్రమైన గో సంబంధమైన ద్రవ్యాలతో అనీతం గావించారు. మహోత్సవాల్లో భాగంగా రుత్విగ్వరణం చేపట్టారు. పారాయణ క్రమాలను పార్వతీ పరమేశ్వరులకు విన్నవించుట సంప్రదాయంగా రుత్వికులకు దీక్షా వస్ర్తాలను సమర్పించారు.
మహాకుంభాభిషేక మహోత్సవాల్లో ప్రధానమైన అంకురారోపణ కార్యక్రమాన్ని సాయంత్రం 5.00 గంటలకు స్మార్తాగమ సంప్రదాయంగా నిర్వహించారు. ఆయా పాలికలలో మంత్ర పూర్వకంగా నవ ధాన్యాలను సమర్పించి, వేద మంత్రాలు, క్షీర, జలాలు, సంప్రోక్షణలతో ఉత్సవాలు పూర్తయ్యేవరకూ ఆరాధించారు. పాలికలతో మొలకెత్తిన ధాన్యం దేశ సంవృద్ధిని, సౌభాగ్యాలను సూచిస్తుందని ఆర్చకులు, పురోహితులు తెలిపారు. ఉత్సవాల్లో సర్వవిధ శుభాలు కలుగాలని వరుణసూక్త పఠనాలతో ఉదకశాంతిని నిర్వహించి, రక్షోఘ్నహోమాన్ని నిర్వహించారు. నూతన రామలింగేశ్వరాలయంలో సర్వవిధ దోషాలు తొలిగి అత్యంత పవిత్రత చేకూరుతుందని ఆగమశాస్త్రం తెలియజేస్తున్నదని అర్చకులు, వేద పండితులు, పురోహితులు తెలిపారు.
ఉత్సవాల్లో భాగంగా రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రదక్షిణ, శివానుగ్రహం, శివదీక్ష స్వీకరించిన అనంతరం స్వయంభూ ప్రధానాలయంలోని పంచనారసింహుడి వద్దకు వెళ్లి ప్రధానార్చకులచే స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం ఆశించి ఉత్సవాల నిర్వహణకు అనుమతిని స్వీకరించారు. ఈ వేడుకల్లో అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ ఈఓ ఎన్.గీత, ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, శివాలయ ప్రధాన పురోహితుడు సత్యనారాయణ శర్మ, ప్రధానార్చకులు నర్సింహరామశర్మ, భద్రకాళి ఆలయ ప్రధానార్చకుడు శేషశర్మ పాల్గొన్నారు.
ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు యాగశాల ప్రవేశం, మండప, స్తంభ ద్వార తోరణ పూజ, చతుస్థానార్చన, హోమకుండ సంస్కారం, అగ్ని ప్రతిష్ఠ, మహారుద్ర పునశ్చరణ, మూలమంత్రానుష్టాన హవనం. సాయంత్రం 5 గంటల నుంచి 8.30 గంటల వరకు శాంతి, దీక్షాహోమం, అగ్న్యత్తారణం, కౌతుకబంధనం, జలాధివాసం.