యాదాద్రి, ఏప్రిల్ 18 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దివ్య క్షేత్రంలో సోమవారం స్వాతి నక్షత్ర పూజల కోలాహలం నెలకొంది. తెల్లవారుజామున 3.30గంటల నుంచి 5.30వరకు గిరిప్రదక్షిణలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో 3.30గంటల పాటు శ్రీవారి అష్టోత్తర శతఘటాభిషేకం కనుల పండువగా నిర్వహించారు. ఆలయ పునః ప్రారంభం అనంతరం తొలిసారి నిర్వహించిన స్వాతి నక్షత్ర పూజలను ప్రధానాలయంలోని ముఖ మండపంలో ఘనంగా జరిపించారు. స్వయంభూ ప్రధానాలయంలో నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు ఘనంగా జరిపారు. ఉదయం 3.30గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ తిరువారాధన చేశారు. అనంతరం స్వామికి నిజాభిషేకం చేపట్టి, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామర్చన నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
యాదాద్రి పునర్నిర్మాణం అనంతరం స్వయంభూ ప్రధానాలయంలో తొలిసారి స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణోత్సవ వేడుక ఘనంగా జరిపించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ప్రధానాలయ తిరువీధుల్లో ఊరేగించారు.
రామలింగేశ్వరుడికి
యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామికి సోమవారం రుద్రాభిషేకం జరిపించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండటంతో రామలింగేశ్వరుడి ప్రత్యేక పూజలు చేసిన వెంటనే యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వివిధ విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ. 17,68,717 సమకూరిందని ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు.
శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్, తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ కుటుంబ సమేతంగా వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,82,950
వీఐపీ దర్శనాలు 32,700
వేద ఆశీర్వచనం 3,000
నిత్యకైంకర్యాలు 6,102
సుప్రభాతం 4,100
క్యారీబ్యాగుల విక్రయం 17,000
వ్రత పూజలు 61,600
కళ్యాణకట్ట టిక్కెట్లు 26,000
ప్రసాద విక్రయం 10,72,850
వాహనపూజలు 6,700
అన్నదాన విరాళం 11,545
శాశ్వత పూజలు 7,500
సువర్ణ పుష్పార్చన 2,08,400
యాదరుషి నిలయం 60,200
పాతగుట్ట నుంచి 35,670
గోపూజ 800