‘యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అనుబంధమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర ఆలయంలో ఈ నెల 20న మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమవుతాయి.. శివాలయం ప్రతిష్ఠ, ఉపదేవీ దేవతల ప్రతిష్ఠతోపాటు ఐదురోజులు పాంచాహ్నిక దీక్షా విధానంతో పంచకుండాత్మక రుద్రయాగం నిర్వహిస్తాం.. శ్రీరాంపురం పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతీ స్వామి చేతుల మీదుగా పూజాది కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా జరుగుతాయి.. ఈ నెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫటిక లింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు’అని యాదాద్రి ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రి, ఏప్రిల్18: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనుబంధమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర ఆలయంలో ఈ నెల 20న ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర పూజతో మహాకుంబాభిషేక మహోత్సవాలకు శ్రీకారం చుడుతున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. ఈ నెల 20నుంచి 25వరకు మహాకుంబాభిషేక మహోత్సవాలు స్మార్తగమ శాస్త్రం ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. శివాలయం, ఉపదేవీదేవతల ప్రతిష్ఠతో 21నుంచి ఐదురోజులపాటు పాంచాహ్నిక దీక్షా విధానంతో పంచకుండాత్మక రుద్రయాగం జరిపిస్తామని తెలిపారు.
ఈ నెల 25న ఉదయం 10.25గంటలకు ధనిష్టా నక్షత్ర యుక్త మిధున లగ్న పుష్కరాంశ సుముహూర్తాన పరమ హంస పరివ్రాజకాచార్యులైన శ్రీరాంపురం(తొగుట) పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతీ స్వామి చేతుల మీదుగా రామలింగేశ్వర స్పటిక లింగ ప్రతిష్ఠ, అష్టబంధం, ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలు ఉంటాయని, ఈ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు.
ఈ మహోత్సవాలకు వేములవాడ, బాసరతో పాటు రాష్ట్రంలోని వివిధ ఆలయాల నుంచి సుమారు 54 మంది ఆచార్య బ్రహ్మ వేద పారాయణ, యజ్ఞాచార్య, రుత్విక్, పరిచారక బృందం పాల్గొంటారని, వీరంతా 19వ తేదీ సాయంత్రానికి యాదాద్రికి చేరుకుంటారని తెలిపారు. వీరికి తులసీ కాటేజీలోని లక్ష్మీసదనంలో బస ఏర్పాటు చేశామన్నారు. కొండపై అనువంశిక ధర్మకర్త భవనం ప్రాంగణంలో భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకరణతో శివాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పటికే కలశ స్థాపనకు పరంజా, మహా యాగానికి యాగశాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఉత్సవాలకు అందరూ ఆహ్వానితులేనని, ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానం లేదని స్పష్టం చేశారు. సమావేశంలో ఆలయ ఏఈఓ భాస్కర్ శర్మ పాల్గొన్నారు.