యాదాద్రి, ఏప్రిల్ 17: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నర్సింహ స్వామి దర్శనానికి భక్తులు ఆదివారం బారులు దీరారు. సెలవు దినం కావడంతో ఇలవేల్పు దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంటల కొద్దీ క్యూలో నిలుచుని స్వామిని దర్శించుకున్నారు. స్వయంభూ పంచనారసింహుడికి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉదయం 4గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనారసింహుడికి బిందెతీర్థం చేపట్టి, ఆరాధనలు చేశారు. స్వామికి బాలబోగం, పుష్పాలంకరణ సేవ చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం స్వామికి నిజాభిషేకం, సహస్రనామార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామికి తిరువారాధన, సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన జరిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి.
పాతగుట్ట ఆలయంలో స్వామి ఆర్జిత పూజల కోలాహలం నెలకొన్నది. భక్తులు స్వామి నిత్యకల్యాణంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం, నవగ్రహాలకు తైలాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిపే సత్యనారాయణ స్వామి వత్ర పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని విభాగాలు కలుపుకుని స్వామి వారి ఖజానాకు రూ.22,44,563 సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,46,600
వీఐపీ దర్శనం 59, 250
వేద ఆశీర్వచనం 4,800
సుప్రభాతం 2,900
క్యారీబ్యాగుల విక్రయం 20,000
వ్రత పూజలు 1,08,800
కల్యాణకట్ట టిక్కెట్లు 47,600
ప్రసాద విక్రయం 13,53,400
వాహనపూజలు 9,900
అన్నదాన విరాళం 28,793
శాశ్వత పూజలు 22,500
సువర్ణ పుష్పార్చన 2,74,000
యాదరుషి నిలయం 80,780
పాతగుట్ట నుంచి 83,040
లక్ష్మీపుష్కరిణి 1,900