ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపం.. తమకు ఇష్టం లేకున్నా కూతురు అతనితో కలిసి జీవిస్తున్నదనే ఆక్రోశం.. వెరసి అల్లుడిని కిరాతకంగా హత్య చేయించాడు మామ. సుపారీ ఇచ్చి దారుణానికి ఒడిగట్టాడు. ఈ నెల 15న గుండాల మండలం రామారంలో హత్య చేయించి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారంలో పాతిపెట్టారు. భర్త కోసం వేచి చూసిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మామతోపాటు మరో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. రెండేండ్లుగా కూతురు దూరంగా ఉండడం, మనమరాలు పుట్టినా తమ ఇంటికి రాకపోవడంతో అల్లుడిపై కక్షగట్టి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 17 : కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో మామ అల్లుడిని సుపారీ ముఠాతో హత్య చేయించాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు, మృతుడి భార్య, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లికి చెందిన ఎరుకల రామకృష్ణగౌడ్ (35) హోంగార్డుగా పనిచేసి సస్పెండ్ అయ్యాడు. అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
యాదగిరిగుట్టకు చెందిన పల్లెపాటి వెంకటేశ్ కుమార్తె భార్గవిని 2020 ఆగస్టు 16న పోలీసుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. తమకు ఇష్టం లేని పెండ్లి చేసుకున్నావని, భర్తను వదిలి రావాలని యువతి తల్లిదండ్రులు పలుమార్లు భార్గవిని ఒత్తిడి చేశారు. తాము కలిసే ఉంటామని భార్యాభర్తలు తేల్చి చెప్పి.. భువనగిరి పట్టణంలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం వారికి ఆరు నెలల పాప ఉంది. ఈ క్రమంలో పగ పెంచుకున్న భార్గవి తండ్రి వెంకటేశ్.. రామకృష్ణగౌడ్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. సిద్దిపేట జిల్లాకు చెందిన పాత నేరస్తుడు లతీఫ్‌కు సుపారీ చెల్లించి రామకృష్ణను హత్య చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు.
సుపారీ తీసుకున్న లతీఫ్.. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో రామకృష్ణను పలుమార్లు ఫోన్లో సంప్రదించాడు. భూములు కొనుగోలు చేస్తామని చూపెట్టాలని కోరాడు. దాంతో రామకృష్ణ తన స్నేహితుడైన భువనగిరి మండలం జమ్మాపురం గ్రామానికి చెందిన అమృత్‌తో కలిసి లతీఫ్ ముఠా సభ్యులకు భూములు చూపేందుకు ఈ నెల 15న ఉదయం కారులో వెళ్లాడు. గుండాల మండలం రామారం గ్రామ శివారులోకి వెళ్లగానే కిరాయి హంతకులు రామకృష్ణను కారులోనే హత్య చేశారు. అమృత్‌ను బెదిరించి వెళ్లగొట్టారు. అనంతరం నిందితులు మృతదేహాన్ని మూట కట్టి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం గ్రామ శివారులోని పెద్దమ్మ ఆలయం దగ్గరలో జరుగుతున్న రైల్వే పనుల్లోని మట్టి గుంతల్లో పాతిపెట్టారు.
రాత్రి అయినా రామకృష్ణ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య భార్గవి 16న భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు పట్టణ సీఐ సత్యనారాయణ విచారణ చేపట్టారు. రామకృష్ణ స్నేహితుడు అమృత్‌ను విచారించగా, జరిగిన విషయం చెప్పాడు. యాదగిరిగుట్టలో భార్గవి తండ్రి వెంకటేశ్‌ను, సిద్దిపేటలో సుపారీ ముఠాలోని 9మందిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం గ్రామ శివారులోని పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
వలిగొండ : ఎలుకల రామకృష్ణ హత్యతో అతడి సొంతూరు వలిగొండ మండలంలోని లింగరాజుపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామకృష్ణ మేనమామ వద్ద ఉంటూ చదువుకొని హోం గార్డుగా ఉద్యోగం పొంది మండల కేంద్రంలో పని చేశాడు. అనంతరం యాదగిరిగుట్టకు బదిలీ అయ్యాడు. ప్రస్తుతం ఉద్యోగం మానేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.