జిల్లాలో కొనుగోళ్ల వివరాలు
‘పంటైతే పుష్కలంగ పండింది.. అమ్ముకునుడే ఎట్లనో’అని అన్నదాతలు రంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం గుండె నిబ్బరం కల్పించింది. యాసంగి ధాన్యం కొనేందుకు కేంద్రం ససేమిరా అన్నప్పటికీ రైతులెవరూ ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఎప్పటిలాగే ఊరూరా కాంటాలు పెట్టి వడ్లు కొనేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో రైతులు వరిని 1,63,353 ఎకరాల్లో సాగు చేశారు. 3,54,570 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుండగా జిల్లా అవసరాల మేరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 260 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఆదివారం నుంచి కొనుగోళ్లు షురూ అయ్యాయి. కొనుగోళ్లకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం గన్నీ బ్యాగులతోపాటు మిగతావాటిని అందుబాటులో ఉంచింది.
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. గత సీజన్లో కరోనా ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరించగా.. ఈసారి కూడా అదే స్థాయిలో కొనుగోళ్లు జరిపేలా చర్యలు తీసుకుంటున్నది. కేంద్రం యాసంగి ధాన్యం విషయంలో కొర్రీలు పెట్టడంతో ముందు జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని సూచించింది. ఈ మేరకు రైతాంగం గతంలో కంటే 70 ఎకరాల్లో తక్కువగా వరిని సాగు చేశారు.
జిల్లాలో ఇప్పటికే అక్కడక్కడా కోతలు కూడా జోరందుకున్నాయి. అమ్మేందుకు సిద్ధ్దం చేసి ఉంచిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలివస్తున్నది. ఈ పరిస్థితుల్లో పండించిన ప్రతి గింజనూ కొనేందుకు ప్రభుత్వం సిద్ధ్దపడగా జిల్లా యంత్రాంగం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నది
యాసంగిలో భారీ ఎత్తున ధాన్యం దిగుబడులు రానుననడంతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం జిల్లాలో 260 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. గ్రామాల్లోనే కాంటాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేయనుంది. ఈ ఏడాది యాసంగిలో 1,65,353 విస్తీర్ణంలో వరిని రైతులు సాగు చేయగా.. 3,54,570 మెట్రిక్ టన్నుల వరకు వరి దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే జిల్లా అవసరాల మేరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. అంతకుమించి ధాన్యం వచ్చినా కొనుగోలు చేసేందుకు జిల్లా అధికారులు సర్వం సిద్ధ్దం చేసి ఉంచారు.
ఇప్పటికే మద్దతు ధరను ప్రకటించిన ప్రభుత్వం క్వింటాలుకు రూ.1,960 చెల్లించి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. వడ్ల కొనుగోళ్ల కోసం జిల్లాలో 260 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో92 కేంద్రాలు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో164, వ్యవసాయ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో 4 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా ఎక్కడైతే వరి కోతలు మొదలయ్యే అవకాశం ఉన్నదో.. అక్కడ కేంద్రాలను ముందుగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆతర్వాత కోతల క్రమాన్ని బట్టి కేంద్రాలను ప్రారంభించనున్నారు.
ముందస్తు చర్యల్లో భాగంగా 6.70 లక్షల గన్నీ బ్యాగులను సైతం అందుబాటులో ఉంచారు. వర్షం పడితే ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచడంతోపాటు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సౌకర్యం కల్పిస్తున్నారు. ఆదివారం వలిగొండ మండల కేంద్రంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సోమవారం నుంచి మరిన్ని కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగి సీజన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూతత కొనే విధంగా చర్యలు చేపట్టారని అన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వాకిటి పద్మాఅనంతరెడ్డి, సర్పంచ్ బోళ్ల లలిత, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కునపూరి కవిత, పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్‌రెడ్డి, శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్‌రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ గూడూరు శ్రీధర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, కంభంపాటి శ్రీనివాస్, లింగస్వామి పాల్గొన్నారు.