చౌటుప్పల్, ఏప్రిల్ 16 : మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామ సమీపంలో లారీ కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న 700 కిలోల గంజాయిని చౌటుప్పల్ పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. చౌటుప్పల్ ఏసీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఇన్చార్జి డీసీపీ పి.యాదగిరి వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వారా జిల్లా రుప్పుర పోస్ట్ ఆసింద్ తహసీల్ బాగమలి గ్రామానికి చెందిన రాజేంద్రసింగ్(28), అదే రాష్ట్రంలోని భిల్వారా జిల్లా ఆసింద్ తహసీల్ ఓజియాన గ్రామానికి చెందిన అర్జున్‌సింగ్ రావత్ లారీ డ్రైవర్లు. రాజస్థాన్ రాష్ర్టానికి చెందిన పూరన్‌సింగ్ అక్రమంగా గంజాయిని అమ్ముతుంటాడు. ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన గంజాయి సరఫరా చేసే ముకేశ్‌తో పరిచయం ఏర్పడింది. ముకేశ్ నుంచి కొంతకాలంగా గంజాయి కొనుగోలు చేస్తున్న పూరన్‌సింగ్ రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో అమ్ముతున్నాడు.
ఈ క్రమంలో రాజస్థాన్‌లోని పూరన్‌సింగ్‌కు గంజాయి సరఫరా చేస్తే ట్రిప్పునకు లక్ష రూపాయలు చెల్లిస్తానని లారీ డ్రైవర్లు రాజేంద్రసింగ్, అర్జున్‌సింగ్(23) తో ముకేశ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా వారు ఎవరికీ అనుమానం రాకుండా లారీ కంటైనర్ అడుగు భాగంలో 700కిలోల గంజాయి బస్తాలను పెట్టి వాటిపై ఫ్లైవుడ్, డెకోలం షీట్లను వేసి రాజమండ్రి నుంచి రాజస్థాన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న ఏసీపీ ఉదయ్‌రెడ్డి,చౌటుప్పల్ సీఐ ఎన్.శ్రీనివాస్ వలిగొండ, రామన్నపేట పోలీస్ సిబ్బందితో చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ శివారులో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కనున్న మూతపడ్డ భాస్కర ఆగ్రో కెమికల్స్ వద్ద లారీ కంటైనర్‌పై మెరుపు దాడి చేశారు. కంటైనర్‌లోని రూ.84లక్షల విలువైన 700 కిలోల గంజాయిని, నిందితుల వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
లారీ కంటైనర్‌ను సీజ్ చేశారు. రాజేంద్రసింగ్, అర్జున్‌సింగ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపుతామని ఇన్చార్జి డీసీపీ యాదగిరి తెలిపారు. గంజాయి సరఫరా చేస్తున్న రాజమండ్రికి చెందిన ముకేశ్, రాజస్థాన్‌కు చెందిన పూరన్‌సింగ్ పరారీలో ఉన్నారని తెలిపారు. వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వెల్లడించారు. గంజాయిని పట్టుకున్న ఏసీపీతోపాటు పోలీసు సిబ్బందిని అభినందించి రివార్డు అందజేశారు.