
డీఈవో చైతన్యజైని
బీబీనగర్, ఆగస్టు 28 : ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతుండటంతో డీఈవో చైతన్యజైని శనివారం మండలంలోని మహదేవ్పూర్, కొండమడుగు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి శానిటైజేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో తరగతి గదులు, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాలలు ప్రారంభ ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల నిర్వహణలో కరోనా నియమ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మహదేవ్పూర్ గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు అందిస్తున్న పోషకాహార పాకెట్లను, రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది ఉన్నారు.